Tree Behavior: ఈ సంవత్సరం నేరేడు వృక్షాలు విస్తారంగా కాపు కాచాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేరేడు చెట్లు విపరీతంగా పూత పూచాయి. కాయలు కూడా విస్తారంగా ఉండడంతో ఈసారి రైతులకు లాభాలు వచ్చాయి. అయితే నేరేడు పండ్లు ఈ స్థాయిలో ఉండడం వెనక రకరకాల కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఈ సంవత్సరం కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడం లేదు. కొన్ని ప్రాంతాలలో మాత్రమే వర్షాలు పడుతున్నాయి. మిగతా ప్రాంతాలలో పొడి వాతావరణం ఉంటున్నది. దీనికి తోడు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల పంటల సాగు సాధ్యం కావడం లేదు. భూములు కూడా బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.
వాస్తవానికి నేరేడు చెట్టుకు ఆ స్థాయిలో కాయలు కాయడం వెనక ఒక ప్రకృతి పరమైన హెచ్చరిక ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణంలో కరువు ఉంటేనే నేరేడు చెట్లు ఇలా కాయలు కాస్తుంటాయని.. ఎందుకంటే వాతావరణంలో అనూహ్యమైన మార్పులు ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు నేరేడు చెట్లు విస్తారంగా కాయలు కాస్తాయి. తమ సంతతిని పెంచుకోవడానికి అవి శక్తికి మించి నీటి వనరులు ఉపయోగించుకుంటాయి. ఒక సమయంలో తాము చనిపోయినా పర్వాలేదు గానీ.. తమ సంతతి వృద్ధి చెందాలని ఆలోచిస్తాయి. అందువల్లే ఈ స్థాయిలో కాపు కాస్తుంటాయి. ఈసారి నేరేడు చెట్లు విస్తారంగా కాయలుకాచిన నేపథ్యంలో..ఎల్ నినో గురించి ముందుగానే అవి హెచ్చరికలు పంపించారని వృక్ష శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
నేరేడు వృక్షాలు మాత్రమే కాదు.. ఈసారి వచ్చే కరువు కాటకాల గురించి ఈత చెట్లు కూడా ముందుగానే చెప్పాయి. ఎందుకంటే ఈ సంవత్సరం ఈత చెట్లకు కాచిన కాయలు పక్వానికి రాకుండానే కుళ్లిపోయాయి. ఎటువంటి తెగులు.. సోకకుండానే ఈత చెట్ల కాయలు ఎండిపోవడం ప్రకృతి పరంగా జరిగే పరిణామానికి సంకేతం. ఎందుకంటే ఈత చెట్లు ముందుగానే ప్రకృతిలో జరిగే పరిణామాలను అంచనా వేస్తాయి. ప్రకృతి తమకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు.. భవిష్యత్తు కాలంలో వ్యతిరేకంగా జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అవి ప్రతి చర్యలను చూపిస్తూ ఉంటాయి.
ఉదాహరణకు భూగర్భంలో సరైన స్థాయిలో నీరు నిల్వ లేకపోతే.. అప్పటికప్పుడు ఈత వృక్షాలు ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. తనకు కాచిన కాయలకు నీటి సరఫరాను నిలిపివేస్తాయి. దీనివల్ల ఈత కాయలు పక్వానికి రాకుండానే ఎండిపోతుంటాయి. ఇలా నీటి సరఫరా నిలిపివేసి.. భవిష్యత్తు రోజుల్లో ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేందుకు ఈత చెట్టు ఉపక్రమిస్తుంది. అందువల్లే ఈసారి ఈత కాయలు పక్వానికి రాకుండానే ఎండిపోయాయి. గతంలో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు ఈత చెట్ల కాయలు ఎండిపోయేవి. అయితే ఈసారి కూడా ఈత కాయలు ఎండిపోయిన నేపథ్యంలో.. తీవ్రస్థాయిలో కరువు కాటకాలు సంబంధించి ప్రమాదం ఉందని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.