Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రేకులు లేని బుల్డోజర్ లాగా దూసుకుపోతున్నారు. వేదిక దొరకడమే ఆలస్యం.. మీడియా ప్రతినిధులు రావడమే ఆలస్యం.. నోరు తెరిస్తే చాలు బ్రేకింగ్ న్యూస్ అవుతున్నారు. సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ మీడియా మొత్తాన్ని తనవైపు తిప్పుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్నారు.
ఏపూరి సోమన్న పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం మీద.. కాంగ్రెస్ పార్టీ మీద.. రేవంత్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రాజగోపాల్ రెడ్డి. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం కలిగించాయి. వాటిని మర్చిపోకముందే.. కేవలం ఒక్కరోజు గ్యాప్ లోనే రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ఈసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద సంచలన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బయటినుంచి వచ్చిన వారి పెత్తనం పెరిగిపోయిందని.. వారంతా కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గౌరవం లేకుండా పోయిందని.. పార్టీలు మారిన నాయకులు పెత్తనం చేస్తున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకుల మోచేతి నీళ్లు తాగే వ్యక్తుల పెత్తనం పెరిగిపోయిందని రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈసారి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆయన పరిపాలన మీద.. ప్రజా ప్రభుత్వంలో సాగుతున్న వ్యవహారాల మీద విమర్శలు చేశారు.
తాను పార్టీ మారేది లేదని.. రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేస్తానని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వంలో జవాబుదారితనం ఉండాలని.. అది లేనప్పుడు ప్రజల నుంచి అసంతృప్తి కచ్చితంగా వ్యక్తమవుతుందని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల సమస్యలు పరిష్కరించే వ్యవస్థ రూపుదిద్దుకోవాలని.. అలాకాకుండా కాంట్రాక్టర్లకు.. వ్యాపారులకు మేలు చేకూర్చే వ్యవస్థ ఏర్పడకూడదని రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు.
రాజగోపాల్ రెడ్డి రోజుకో తీరుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో డ్యామేజ్ జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కకపోతే నేరుగా రాహుల్ గాంధీని అడగాలని.. అధిష్టానాన్ని సంప్రదించాలని.. అలాకాకుండా ముఖ్యమంత్రి మీద.. పార్టీ మీద ఇలా విమర్శలు చేస్తే పార్టీ పరువు బజార్లో పడుతుందని.. దానివల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా రాజగోపాల్ రెడ్డి తన నోటికి ఫుల్ స్టాఫ్ పెడతారా.. ఇలానే విమర్శలు చేసుకుంటూ పోతారా.. చూడాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగే వాళ్ల పెత్తనం ఎక్కువైంది
– కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి https://t.co/OfesQDMaXM pic.twitter.com/Esq7OyxyON
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2026