KCR Kavitha: రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. చివరికి కుటుంబ సభ్యుల మధ్య బంధాలు కూడా రాజకీయాల వల్ల పల్చగా మారిపోతాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో రాజకీయాల వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు మాయమైపోయిన ఉదంతాలను మనం చాలా చూశాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిలో మరోసారి చూడాల్సి వస్తోంది.
భారత రాష్ట్ర సమితికి సుప్రీం లీడర్ గా కేసీఆర్ ఉన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ కొనసాగుతున్నారు. ఆ పార్టీలో కీలక నాయకుడిగా హరీష్ రావు ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. కేటీఆర్ మిగతా వ్యవహారాలు పర్యవేక్షించేవారు. అప్పట్లో కవిత భారత రాష్ట్ర సమితి లో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఆమె ఓడిపోయారు. అప్పుడు కెసిఆర్ ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఎప్పుడైతే లిక్కర్ వ్యవహారంలో ఆమె పేరు వినిపించిందో.. ఆమె తీహార్ జైల్లో శిక్ష అనుభవించారో.. అప్పుడే ఆమె రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఆమెను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచడంతో.. పరిస్థితి వేరే వైపు టర్న్ తీసుకుంది.
గతంలో తండ్రి చాటు బిడ్డగా వ్యవహరించిన కవిత ఆ తర్వాత తనలో ఉన్న అసలు రాజకీయ నాయకురాలిని బయటకి తీసింది . ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం మీద విమర్శలు చేయడం మొదలుపెట్టింది. కెసిఆర్ నుంచి మొదలు పెడితే హరీష్ రావు వరకు ఎవరిని వదిలిపెట్టకుండా ఆమె ఆరోపణలు చేయడం ప్రారంభించింది. ఒకరకంగా ఇది భారత రాష్ట్ర సమితికి తీవ్రమైన ఇబ్బందికరంగా మారింది. సొంత కూతురే ఇలా చేయడంతో కెసిఆర్ నిశ్శబ్దంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి కేటీఆర్ కూడా కవిత వ్యవహారం మీద మాట్లాడలేని దుస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో కేటీఆర్ కవితతో జరిగిన విభేదాలను పరోక్షంగా వెల్లడించినప్పటికీ.. అప్పటికే గులాబీ పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
గులాబీ పార్టీకి సొంత ఐడెంటిటీ లాగా ఉండే టిఆర్ఎస్ అనే పేరును కూడా కవిత తీసేసుకుంది. తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీని ఏర్పాటు చేసింది. తనకంటూ రాజకీయ ఆస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆమె అడుగులు వేస్తోంది. అయితే కెసిఆర్ బామ్మర్ది అనారోగ్యంతో చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆ సమయంలో కవిత కెసిఆర్ ను చూసినప్పటికీ.. నేరుగా ఆయనకు ఎదురు పడలేక పక్కకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. కెసిఆర్ కు కవిత అంటే చాలా ఇష్టం.. ఆమెకు పార్టీలో విశేషమైన ప్రాధాన్యం ఇచ్చారు. ఒక దశలో కవిత లేకుండా కేసీఆర్ ఏ పని కూడా చేసేవారు కాదు. కానీ రాజకీయ సమీకరణాలు.. మారిన పరిస్థితుల నేపథ్యంలో కవిత నేరుగా తన తండ్రి మీదనే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. తన తండ్రి పరిపాలన కాలంలో సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని.. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదని.. కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు సరైన ప్రాధాన్యం లభించలేదని ఆరోపించారు. మొదట్లో కవిత ఆరోపణలను గులాబీ పార్టీ సోషల్ మీడియా సీరియస్గా తీసుకోలేదు. ఎప్పుడైతే కవిత వ్యవహారం శృతిమించడంతో గులాబీ పార్టీ సోషల్ మీడియా.. గులాబీ పార్టీ నాయకులు ఆమెమీద కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. ఈ రాజకీయ వైరం చివరికి తన తండ్రి కనిపించినప్పటికీ దూరంగా జరిగే స్థాయికి వెళ్లిపోయింది.. అందుకే అంటారు రాజకీయాలు దేనికైనా దారి తీస్తాయి. ఎవరినైనా విడదీస్తాయని..
కేసీఆర్ ను చూసి పక్కకు వెళ్లిపోయిన కవిత… #kcr #kavitha pic.twitter.com/kHqDTpIo1t
— Telugu360 (@Telugu360) August 14, 2026