YS Jagan: రాజకీయాల్లో నాయకుల ప్రకటనలకు చాలా విలువ ఉంటుంది. ప్రత్యర్ధులపై ఆ ప్రభావం ఎక్కువగా చూపుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని నేతలకు తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా పార్టీ అభ్యర్థి ఉండాల్సిందేనంటూ తేల్చేశారు. అలా చేయలేని క్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ లకు, మాజీ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఉండవని కుండ బద్దలు కొట్టి చెప్పారు. అయితే ఈ ప్రకటన వచ్చింది మొదలు తెలుగుదేశం పార్టీ పులివెందులపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. 31 వార్డులకు గాను ఆరు వార్డులను ఏకగ్రీవం చేసుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తద్వారా ఏకగ్రీవాల విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టి.. సొంత పార్టీ శ్రేణుల్లోనే దోషిగా నిలబెట్టాలన్నది టిడిపి ఆలోచనగా కనిపిస్తోంది. సాక్షాత్ అధినేత జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోనే ఏకగ్రీవాలు జరిగితే.. కచ్చితంగా ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా మున్సిపాలిటీలపై పడుతుంది అనేది టిడిపి ఆలోచన.
* టిడిపి సవాల్..
వాస్తవానికి పులివెందుల అనేది వైసిపి తో పాటు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోట. జగన్మోహన్ రెడ్డికి ఒక పెట్టని కోట. అటువంటి చోట టిడిపి గెలవడం అనేది అసాధ్యం. కానీ పులివెందుల జడ్పిటిసి ని గెలిచి గత ఏడాది సవాల్ చేసింది టిడిపి. 2021లో కుప్పం మున్సిపాలిటీ తో పాటు స్థానిక సంస్థలను ఎలా కైవసం చేసుకుందో తెలిసిందే. అంటే ఎంత బలమైన నియోజకవర్గం అయినా అధికార పార్టీ తలుచుకుంటే తప్పకుండా సీన్ మారుతుంది. స్థానిక సంస్థలతో పాటు బైపోల్స్ లో అధికార పార్టీదే హవా. కానీ సార్వత్రిక ఎన్నికల విషయానికి వచ్చేసరికి మొత్తం సీన్ మారిపోతుంది. మొన్న కుప్పం నియోజకవర్గ విషయంలో జరిగింది అదే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీగా పట్టుబిగించిన వైసీపీ.. సార్వత్రిక ఎన్నికల విషయానికి వచ్చేసరికి చేతులెత్తేసింది. ఇప్పుడు అదే పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పులివెందులలో ఎదురవుతుంది.
* ఆ మరు క్షణం నుంచి..
జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలు జరిగితే టిక్కెట్లు ఇవ్వనని తేల్చి చెప్పిన మరుక్షణం నుంచి తెలుగుదేశం పార్టీ పావులు కదపడం ప్రారంభించింది. పులివెందుల మున్సిపాలిటీలో ఓ ఆరు వార్డులు టిడిపికి బలమైనవి. అక్కడ ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు. కచ్చితంగా ఆ ఆరు వార్డులను ఏకగ్రీవం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు బీటెక్ రవి. వైసీపీ అగ్ర నేతలు రంగంలోకి దిగినా అక్కడ ఎవరూ ముందుకు రాని పరిస్థితిని క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ తప్పదు. ఎందుకంటే మిగతా మున్సిపాలిటీలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేతులెత్తేస్తారు. పైగా సాక్షాత్ అధినేత నియోజకవర్గంలోనే ఏకగ్రీవాలు జరిగితే.. ఆయన చేసిన ప్రకటనకు ఏం విలువ ఉంటుంది. జగన్ అదే మాటకు కట్టుబడి ఉంటే తప్పకుండా ఆయన పోటీ చేయరు వచ్చే ఎన్నికల్లో. పులివెందులలో వార్డులు ఏకగ్రీవం అయితే మాత్రం కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక ఆలోచనకు వస్తారు. కచ్చితంగా ఆ కారణం చూపి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తారు. ఇదే అభిప్రాయంతో ఉన్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.