Vijayawada Mayor: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వం ఆలోచన. అందులో ఏకపక్షంగా గెలిస్తే తరువాత జిల్లా పరిషత్తులతో పాటు మండల పరిషత్తులను సునాయాసంగా గెలుచుకోవచ్చు అనేది ప్రభుత్వ భావన. చివరిగా పంచాయితీ ఎన్నికలతో స్థానిక ఎన్నికలను ముగించి పాలనపై దృష్టి పెట్టాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే మేయర్ తో పాటు మున్సిపల్ చైర్మన్ లకు నేరుగా ఎన్నిక అనేది సాహసంతో కూడుకున్న పని. ముఖ్యంగా మేయర్ పదవులకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించితే ప్రయోజనం ఉంటుంది. అందుకే విశాఖ, విజయవాడ, తిరుపతి, కడప వంటి నగరాలకు బలమైన అభ్యర్థులను పెట్టనున్నారు. ఇప్పటినుంచి అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా విజయవాడ కార్పొరేషన్ కు ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి ఆశాకిరణ్, బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్థ పేరు తెరపైకి వచ్చింది. ఇద్దరిలో ఒకరు పోటీ చేయడం ఖాయం.
* వంగవీటి ఫ్యామిలీకి ఛాన్స్..
వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్. మోహన్ రంగా పేరు చెబితే కాపులు తమ వాడిగా చూస్తారు. వెనుకబడిన తరగతుల ఆశాజ్యోతి గా పరిగణిస్తారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మోహన్ రంగా పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన రాజకీయ వారసుడిగా వచ్చారు వంగవీటి రాధాకృష్ణ. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. తరచూ పార్టీలు మారుతారు అన్న విమర్శ ఆయనపై ఉంది. కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం.. అక్కడ నుంచి వైయస్సార్ కాంగ్రెస్.. ఇప్పుడు తెలుగుదేశంలో కొనసాగుతున్నారు. అందుకే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వంగవీటి ఫ్యామిలీ నుంచి రాధాకృష్ణ సోదరి ఆశాకిరణ్ రంగంలోకి దిగబోతున్నారు అనేది ఒక ప్రచారం.
* ఏడాదిగా ఆశాకిరణ్ యాక్టివ్..
వంగవీటి మోహన్ రంగా బతికున్నప్పుడు రంగా రాధా మిత్రమండలి బలంగా పనిచేసేది. అయితే కాలక్రమంలో ఆ మిత్రమా వైభవాన్ని కోల్పోయింది. అందుకే ఈ ఏడాది కిందట తండ్రి ఆశయ సాధన కోసం బయటకు వచ్చారు ఆశాకిరణ్. రంగా రాధా మిత్రమండలి ఐక్యతకు, పూర్వ వైభవానికి కృషి చేస్తున్నారు. రంగా ఆశయ సాధనకు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఆమె రాజకీయ రంగ ప్రవేశం పై రకరకాల ప్రచారం నడిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న టాక్ నడిచింది. జనసేనలో చేరుతారని కూడా విస్తృతంగా ప్రచారం సాగింది. ఇప్పుడు టిడిపిలోకి తెచ్చి మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తారన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో ఉంది. గత ఏడాది కాలంగా ఆమె యాక్టివ్ కావడానికి అదే కారణం అన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* సిద్ధార్థ సైతం..
మరోవైపు బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్థ పేరు కూడా మేయర్ అభ్యర్థిగా వినిపిస్తోంది. బోండా ఉమామహేశ్వరరావు వంగవీటి మోహన్రంగా అనుచరుడు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. 2014లో తొలిసారిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బలమైన నేతగా ఎదిగిన ఆయన 2019లో మాత్రం స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. వైసీపీ హయాంలో ఐదేళ్ల కాలంలో బలమైన వాయిస్ వినిపించిన నేతల్లో ఒకరు. అయితే ఈసారి గెలవడంతో తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. దక్కకపోయేసరికి అసంతృప్తికి గురయ్యారు. ఇటీవల బాహటంగానే తనలో ఉన్న బాధను బయటపెట్టారు. మరోవైపు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తో వేదిక పంచుకోవడం కూడా వివాదంగా మారింది. బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ లైన్ లోకి వెళ్తున్నారన్న ప్రచారం జరిగింది. వాటన్నింటికీ బ్రేక్ వేస్తూ ఉమామహేశ్వరరావు చంద్రబాబుతో భేటీ అయ్యారు తన ఇద్దరు కుమారులతో కలిసి. ఈ క్రమంలో పెద్ద కుమారుడు సిద్ధార్థ కు మేయర్ పదవి ఇస్తామని చంద్రబాబుతో పాటు లోకేష్ హామీ ఇచ్చినట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం. మరి విజయవాడ మేయర్ పదవి ఎవరికి వరిస్తుందో చూడాలి.