KCR Erravalli Farm House: కెసిఆర్ ఎర్రవల్లిలో అమరవీరుల కాలనీ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. కేవలం దీనిని ఒక కాలనీ నిర్మాణ నిర్ణయంగా మాత్రమే కాకుండా.. భూమి.. కెసిఆర్ రాజకీయ వారసత్వం.. తెలంగాణ ఉద్యమ అమరవీరుల సెంటిమెంట్ అనే మూడు అంశాలను ఒకే చోట కలిపే నిర్ణయం లాగా చూడవచ్చు. అయితే దీని రాజకీయ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు చెప్పడం కంటే.. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే అంశంగా చూడడమే ఉత్తమం…
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి లోని సర్వేనెంబర్ 325లో రికార్డుల ప్రకారం 388 ఎకరాలు ఉండగా.. క్షేత్రస్థాయిలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు అంటే 45 ఎకరాల మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఈ భూముల పై రీ సర్వే చేయాలని.. సమీపంలోన భూ యజమానుల నుంచి రికార్డులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కెసిఆర్.. ఆయన కుటుంబ సభ్యుల భూములు కూడా ఈ ప్రాంతానికి ఆనుకొని ఉన్నాయని అధికారులు చెబుతున్న నేపథ్యంలో.. వారికి కూడా నోటీసులు ఇస్తారని మీడియా సంస్థల కథనాల ద్వారా తెలుస్తోంది. ఇదే సమయంలో గుర్తించే ప్రభుత్వ భూమిలో అర్హులైన స్థానిక రైతులకు భూములు పంపిణీ చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమ అమ వీరుల కోసం ప్రత్యేకంగా అమరవీరుల కాలనీ ఏర్పాటు చేయాలని రేవంత్ స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించి 2027 జూన్ రెండు నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రాజకీయంగా కేసిఆర్ కు అత్యంత కీలకమైన ప్రాంతం ఎర్రవల్లి. తెలంగాణ రాజకీయాల్లో ఇది సాధారణ గ్రామం కాదు. కెసిఆర్ వ్యవసాయ క్షేత్రం వల్ల ఈ ప్రాంతానికి రాష్ట్రంలోనే రాజకీయంగా గుర్తింపు ఏర్పడింది ఇలాంటి ప్రాంతంలో తెలంగాణ అమరవీరుల కాలనీ వస్తే దానికి ఒక బలమైన రాజకీయ ప్రతీకాత్మకత ఏర్పడుతుంది. దీనిని రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు లభించే గౌరవం లాగా చూస్తోంది. గులాబీ పార్టీ మాత్రం ఈ పరిణామాన్ని భూముల వ్యవహారంతో ముడిపెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది.. .
తెలంగాణ ఉద్యమ చరిత్రతో గులాబీ పార్టీకి ఉన్న అనుబంధం దృష్ట్యా రాజకీయంగా రేవంత్ రెడ్డి తీసుకొని నిర్ణయం కీలకంగా కాబోతోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అమరుల సెంటిమెంటును ఒక ప్రత్యక్ష ప్రభుత్వ నిర్మాణంతో అనుసంధానం చేస్తుంది. ఇది భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమ వారసత్వం పై కాంగ్రెస్, గులాబీ పార్టీ మధ్య జరిగే రాజకీయ చర్చలకు మరో అంశాన్ని జోడించవచ్చు. రాజకీయంగా కాలనీ నిర్మాణం కంటే 45 ఎకరాల భూములు ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్న చాలా పెద్దది. 388 ఎకరాలు రికార్డులో ఉంటే.. 343 ఎకరాలు మాత్రమే క్షేత్రస్థాలు కనిపించడం ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం కోరుతుంది. 45 ఎకరాలు ప్రభుత్వ భూమి అని తేలితే ఒక రకమైన రాజకీయ చర్చ మొదలవుతుంది. ప్రవేట్ హక్కులు లేదా ఇతర చట్ట పరమైన అంశాలు బయటపడితే మరో రకమైన చర్చ తెరమీదకి వస్తుంది. రికార్డులలో తప్పిదం అని తేలితే ఇంకో రకమైన చర్చ మొదలవుతుంది.