Asim Munir Comments: గత జూన్ లో పాక్ ఆర్మీ అధిపతి అసీం మునీర్ అమెరికా వెళ్లారు. రెండు నెలలు కూడా గడవకముందే మళ్లీ అమెరికా బాట పట్టారు. పైకి రకరకాల కారణాలు చెబుతున్నప్పటికీ.. అంతర్గత విషయాలు వేరే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.. వాస్తవానికి ఆయన పర్యటనలో తన దేశానికి సంబంధించిన ప్రయోజనాలు చూసుకోవాలి. ఏవైనా ఒప్పందాలు ఉంటే కుదుర్చుకోవాలి. పాకిస్తాన్ ప్రవాసీయులతో మాట్లాడాలి. అయితే ఈ విషయాలను మర్చిపోయి అమెరికా వేదికగా పాకిస్తాన్ ఆర్మీ అధిపతి బరితెగించారు. పాము కంటే ఎక్కువగా భారత్ మీద విషం కక్కారు.
Also Read: రాహుల్ గాంధీతో జగన్ భేటీ
భవిష్యత్తు కాలంలో మా దేశానికి భారతదేశంతో ముప్పు ఉందని తెలిస్తే ఊరుకునేది లేదు. మాది అణ్వాయుధ దేశం. మాతోపాటు సగం ప్రపంచాన్ని మొత్తం ధ్వంసం చేస్తాం. సింధు నది మీద డ్యామ్ కట్టిన తర్వాత దానిని 10 మిస్సైల్స్ తో పేల్చివేస్తాం. సింధు నది భారతీయులకు చెందిన కుటుంబ ఆస్తి కాదు.. మావద్ద మిసైల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని” మునీర్ మండిపడ్డారు.
ఇటీవల కాలంలో మునీర్ తో అమెరికా అధ్యక్షుడు అంట కాగుతున్నారు. ప్రతి విషయంలోనూ మునీర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పాకిస్తాన్లో ఇటీవల విలువైన ఖనిజ నిక్షేపాలు వెలుగు చూశాయి. వాటిని వెలికి తీయాలని ట్రంప్ ఉబలాట పడుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను అటు పాకిస్తాన్, ఇటు అమెరికా ఖండించకపోవడం విశేషం. మరోవైపు పాకిస్తాన్లో ఆర్మీ అధిపతి సుప్రీమ్. అక్కడ ఆర్మీ అధిపతి ఎంత చెబితే అంత. ప్రధానమంత్రి, అధ్యక్షుడు అక్కడ తాత్కాలికం. వారి అధికారాలు కూడా చాలా పరిమితంగా ఉంటాయి. అధ్యక్షుడు, ప్రధానమంత్రి కంటే ఆర్మీ అధిపతి గడచిన రెండు నెలల్లో అమెరికాలో రెండుసార్లు పర్యటించారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ ఆర్మీ అధిపతి ఇంతలా రెచ్చిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా ప్రస్తుతం మన దేశం మీద సుంకాలు విదిస్తున్న క్రమంలో.. పాకిస్తాన్ ఆర్మీ అధిపతి శ్వేత దేశంలో పర్యటించడం సంచలనం కలిగిస్తోంది. మునీర్ తీవ్రమైన విద్వేషాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో.. భారత్ ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.