Tokyo Flood Control: హైదరాబాద్ లో చిన్న వర్షానికే రోడ్లు జలమయం అవుతన్నాయి. ఇక్కడ మాత్రమే కాకుండా దేశంలోని కొన్ని నగరాల్లో కూడా ఇదే పరిస్థితి.. కానీ జపాన్‌లో భారీ వర్షాలు, తుఫాన్లు, సునామీలు వచ్చినా కూడా ఆ దేశ రాజధాని టోక్యోలో నీళ్లు ఆగిన సందర్భాలు లేవు. దీనికి ప్రధాన కారణం జపాన్ ముందుగానే నిర్మించుకున్న అత్యాధునిక వరద నియంత్రణ వ్యవస్థలు, కచ్చితమైన నగర ప్రణాళిక. ముఖ్యంగా ఇక్కడ నిర్మించిన అండర్‌గ్రౌండ్ డిశ్చార్జ్ ఛానల్ (G-Cans Project)తో వరద నీటిని సమర్థవంతంగా నియంత్రిస్తుంది. అసలేంటిది?
ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ వరద నియంత్రణ వ్యవస్థ జపాన్ రాజధాని టోక్యోలో ఉంది. అదే మెట్రోపాలిటన్ ఏరియా అవుటర్ అండర్‌గ్రౌండ్ డిశ్చార్జ్ ఛానల్ (G-Cans Project). దీనిని 1993లో ప్రారంభించగా.. 13 ఏళ్ల తరువాత పూర్తయింది. ఈ ప్రాజెక్టు కోసం ఆ దేశం 2 బిలియన్ డాలర్స్ (రూ.17వేలకోట్లు) ఖర్చు చేసింది. ఈ నిర్మాణంలో భాగందా అండర్ గ్రౌండ్ లో 62 మీటర్ల పొడవు.. 32 మీటర్ల వెడల్పు కలిగిన పెద్ద గొట్టాలను ఐదింటిని నిర్మించారు. ఒక్కో గొట్టం అమెరికా స్టాట్యూ ఆప్ లిబర్టీ అంత ఎత్తు ఉంటుంది. ఈ ఐదింటిని కనెక్ట్ చేస్తూ 6.3 కిలోమీటర్ల టన్నెల్ ను నిర్మించారు. చివరిలో ఒక పెద్ద ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంకు కింద 9 పిల్లర్లు ఉంటాయి. ఇవి ఒక్కోక్కటి 500 టన్నుల బరువు ఉంటాయి.
టోక్యోలో భారీ వర్షం కురిస్తే ముందుగా ఐదు పెద్ద గొట్టాల్లోకి నీటిని డైవర్ట్ చేస్తారు. అక్కడి నుంచి 6.3 కిలోమీటర్ల పొడవు ఉన్న టన్నెల ద్వారా చివరగా ఉన్న వాటర్ ట్యాంకులోకి పంపిస్తారు. ఇక్కడ ఇంజన్లతో ఈ వాటర్ ను ఎడబోవా అనే నదిలోకి పంపిస్తారు. ఈ ప్రాసెస్ అంతా కంప్యూటర్ ద్వారా అవుతుంది. ప్రతీ ఏడాదిలో 7 సార్లు ఈ ప్రాసెస్ అవుతుంది. అయితే వరదలు లేని సమయంలో ఈ ప్రదేశాన్ని టూరిస్టులు విజిట్ చేయవచ్చు.
జపాన్‌లో వర్షపాతం, నదుల నీటి మట్టం, గాలి వేగం వంటి అంశాలను వేలాది సెన్సర్లు 24 గంటలు పర్యవేక్షిస్తుంటాయి. ఎక్కడైనా ప్రమాద స్థాయికి నీరు చేరితే వెంటనే ప్రజల మొబైల్ ఫోన్లకు అలర్ట్‌లు పంపిస్తారు. స్థానిక ప్రభుత్వాలు కూడా వెంటనే ఖాళీ చేయాల్సిన ప్రాంతాలను ప్రకటించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాయి.