Bike Ride Booking: అ ఆ సినిమాలో బాటిల్లో వాటర్ తో ముఖం కడుగుతుంటాడు రావు రమేష్. దానికంటే ముందు తన పనిమనిషితో లేబుల్ తీసేయమని ఆదేశిస్తాడు. లేబుల్ అలాగే ఉంచితే మినరల్ వాటర్ తో ముఖం కడుగుతుంటే బలిసిందని అంటారని..ఆ పనిచేస్తాడు. చూడ్డానికి ఈ సన్నివేశం నవ్వు తెప్పించే విధంగా ఉన్నప్పటికీ.. మనదేశంలో లగ్జరీ అలవాటైతే జనాలు ఎలా మారిపోతారు ఈ సన్నివేశం నిరూపించింది. ఈ సన్నివేశానికి తగ్గట్టుగానే మనదేశంలో ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
Also Read: రాహుల్ గాంధీతో జగన్ భేటీ
సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఓ పోస్ట్ ప్రకారం.. ఓ యువతి తన ఇంటికి వెళ్ళాలి. అప్పటిదాకా ఆమె వివిధ ప్రయాణ సాధనాల ద్వారా అక్కడిదాకా వచ్చింది. అక్కడినుంచి తన ఇంటికి వెళ్లాలి. దానికోసం ఓ బైక్ బుక్ చేసింది. దానిమీద కొద్ది మీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్ళింది. వాస్తవానికి కొద్ది మీటర్ల దూరం మహా అయితే ఐదు నిమిషాల్లో నడవొచ్చు. లేదా పది నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఆ మాత్రం కూడా నడవలేక ఆమె బైక్ బుక్ చేసింది. అలాగని ఆమె అంతగా స్థితి మంతురాలు కాదు.. ఆమె బైక్ బుక్ చేయడానికి.. దాని మీద నడవడానికి ఒక కారణం ఉంది. తన ఇంటికి వెళ్లే మార్గంలో ముఖ్యంగా ఆ 180 మీటర్ల మధ్యలో శునకాలు విపరీతంగా ఉంటాయి.. ఆ వీధి కుక్కలు వెంటపడి కరుస్తుంటాయి. వాటి నివారణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో వాటి సమస్య మరింత తీవ్రంగా మారిపోయింది. అందువల్లే ఆమె ఆ కుక్కల నుంచి తప్పించుకోవడానికి ఆ పని చేసింది.
మన దేశంలో శునకాల దాడుల వల్ల ప్రతి ఏడాది చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. లేదా తీవ్రంగా గాయపడుతున్నారు. మూడు, నాలుగు ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలో శునకాల దాడిలో అనేకమంది చిన్నారులు గాయపడ్డారు. ఓ బాలుడయితే రేబిస్ వ్యాధి బారిన పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వాస్తవానికి ఇటువంటి పరిణామాలు అత్యంత ప్రమాదకరమైనప్పటికీ.. సంబంధిత అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఆ యువతి ఉన్న ప్రాంతంలోనూ శునకాలు అధికంగా ఉండడంతో.. ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక.. ఆమె బైక్ బుక్ చేసుకుని వెళ్ళింది. తనంటే ఆధునిక కాలపు యువతి కాబట్టి సరిపోయింది.. మరి మిగతా వారి పరిస్థితి.. అందు గురించే వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. అధికారులు తన బాధ్యతను నిర్వహించాలి. లేకపోతే ఇదిగో ఇలాంటి సమస్యల వల్ల ప్రజలు నరకం చూడాల్సి వస్తుంది.
ఆ యువతి అధికారులను ప్రశ్నించలేదు. ప్రభుత్వాన్ని నిలదీయలేదు. కాకపోతే సమస్య వల్ల పడుతున్న ఇబ్బందిని పరోక్షంగా వెల్లడించింది. మరి ఇప్పటికైనా అధికారులు మేల్కొంటారా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా.. ఎన్ని రోజులుగా చేయలేని పని ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది అంటారా.. బహుశా అదే నిజం కావచ్చు..