Jagan Meets Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ( Congress Party) నుంచి పుట్టుకొచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీలో ఉన్న ప్రస్తుత క్యాడర్ అంతా కాంగ్రెస్ పార్టీదే. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీయే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా అవతరించింది. అందుకే వైసీపీని పిల్ల కాంగ్రెస్ అని కామెంట్స్ చేస్తుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన కోపం. రెండు పార్టీల నాయకత్వాల మధ్య చాలా గ్యాప్ ఉంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారంతా కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తుంటారు. ప్రత్యేక పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారే కానీ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం మరి ఏ పార్టీలో ఉండదని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తుంటారు. అయితే ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నీరు గారి పోతుందని అంతా భావించారు. కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతుందని అంచనా వేశారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది.
Also Read: రామచంద్రరావు మరో బండి సంజయ్ అవుతారా?
* కాంగ్రెస్ యువనేత దూకుడు..
ప్రస్తుతం రాహుల్ గాంధీ( Rahul Gandhi) దూకుడుగా ఉన్నారు. జాతీయస్థాయిలో బిజెపికి గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. ముఖ్యంగా ఈవీఎంలపై పోరాటం చేస్తున్నారు. ఈవీఎంలతోనే బిజెపి గెలుస్తుందని అనుమానిస్తున్నారు. అందుకే జాతీయస్థాయిలో ‘స్వతంత్ర క్రాంతి’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రాహుల్ గాంధీ ప్రజల్లోకి బలంగా వస్తే మాత్రం.. ఎన్డీఏ కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అయితే ఇప్పటివరకు విపక్షాల మధ్య విభేదాలు ఉండడంతో.. తనదైన రాజకీయం చేశారు మోడీ, షా ద్వయం. రాహుల్ గాంధీ బలపడి.. బిజెపి ప్రత్యర్థులంతా ఏకమైతే మాత్రం కేంద్రంలో ఎన్డీఏ కు చాలా కష్టం. ముఖ్యంగా బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.
* దేశవ్యాప్తంగా పర్యటన..
స్వతంత్ర క్రాంతి( Swatantra Kranti) ఉద్యమంలో భాగంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటించాలని భావిస్తున్నారు. ఈవీఎంలపై పోరాటం చేయాలని చూస్తున్నారు. ఏపీలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే అనుమానంతో ఉంది. తమ పార్టీ బలమైన నియోజకవర్గాల్లో సైతం ఓడిపోవడం ఆ పార్టీకి ఆశ్చర్యపరుస్తోంది. దీనిపై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ తరుణంలో రాహుల్ పోరాటానికి మద్దతు తెలపాలని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో రాహుల్ గాంధీతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి సన్నాహాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
* అంశాల వారీగా మద్దతు..
కాంగ్రెస్ పార్టీకి అంశాల వారీగా మద్దతు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ తన ఇమేజ్ పెంచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం కూడా కనిపిస్తోంది. అదే జరిగితే జాతీయస్థాయిలో తనకు కలిసి వచ్చే పార్టీగా కాంగ్రెస్ ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఏపీలో తనకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తే.. జాతీయస్థాయిలో ఇండియా కూటమిపరంగా మద్దతుగా నిలిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి జగన్ సిద్ధంగా ఉన్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి వ్యతిరేకంగా జగన్ వెళ్తారా? వెళ్తే పాత కేసులు తెరపైకి వస్తాయి కదా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వైసీపీని బతికించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ రూపంలో అవకాశం ఉందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాహుల్ స్వతంత్ర క్రాంతి ఉద్యమానికి మద్దతు తెలిపి.. తరువాత అంశాల వారీగా మద్దతు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.