China India Border: ఆగస్టు 15 భారతీయులకు జాతీయ గర్వాన్ని, అమరుల త్యాగాలను స్మరించుకునే రోజు. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం ఎగురవేయడం, జాతీయ గీతం ఆలపించడం సాధారణం. అయితే ఈసారి స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు కొన్ని మీడియా కథనాలు అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు ప్రాంతం గురించి చేసిన ప్రచారం. నిర్వహించిన డిబేట్లు చర్చనీయాంశమయ్యాయి. ఎగువ అరుణాచల్‌లోని తాక్సింగ్ గ్రామాన్ని చైనా సైన్యం ఆక్రమించిందని కొన్ని ఛానెళ్లు ప్రసారం చేశాయి. ఈ ప్రచారం స్వాతంత్య్ర వేడుకల సమయంలో జాతీయ భావాలపై ప్రభావం చూపే ప్రయత్నం చేశాయి.
వాస్తవ పరిశీలన
కొన్ని జాతీయ మీడియా ఛానెళ్లు తాక్సింగ్ గ్రామం చైనా నియంత్రణలోకి వెళ్లిందని, సమీప మిలటరీ స్థావరం కూడా ప్రమాదంలో ఉందని ప్రచారం చేశాయి. ఈ కథనాలు గంటల పాటు డిబేట్‌లకు దారితీశాయి. కరపత్రాలు, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఇదే సమాచారం వ్యాప్తి చెందింది. అయితే తదనంతరం స్థానిక పరిశీలనలు భిన్న చిత్రాన్ని చూపించాయి. మాజీ మంత్రి ప్రతినిధి మండలి తాక్సింగ్‌కు వెళ్లి పరిస్థితిని పరిశీలించింది. ఆల్ అరుణాచల్ ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ ఆగస్టు 15న అక్కడ జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించింది. ఐఏఎన్‌ఎస్ ప్రతినిధులు కూడా గ్రామానికి వెళ్లారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్థానిక కుటుంబాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి త్రివర్ణ పతాకం ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించి జైహింద్ నినాదాలు చేశారు. సైన్యం, ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ నుంచి సహకారం అందుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనలు గ్రామం భారత నియంత్రణలోనే ఉందని సూచించాయి.
సరిహద్దు సంక్లిష్టతలు ..
అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు విషయంలో భారత్, చైనా మధ్య అధికారిక సరిహద్దు నిర్ధారణ పూర్తి కాలేదు. మెక్‌మోహన్ రేఖను చైనా గుర్తించదు. లద్దాఖ్‌లోనూ ఇలాంటి పరిస్థితి ఉంది. ఇరు దేశాల సైన్యాలు తమ తమ భావనల ప్రకారం పెట్రోలింగ్ చేస్తాయి. ఎదురైతే ప్రొటోకాల్ ప్రకారం బ్యానర్లు చూపించి వాదనలు జరుగుతాయి. ఇవి కొనసాగుతున్న సరిహద్దు నిర్వహణలో భాగం. అయితే ఇటువంటి సాధారణ కార్యకలాపాలను ఆక్రమణగా చిత్రీకరించడం వాస్తవాలను వక్రీకరించే అవకాశం ఉంది.
బాధ్యతాయుత ప్రచారం..
స్వాతంత్య్ర దినోత్సవం సమయంలో సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం హానికరం. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు, సైనికులు రోజువారీ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారి కృషిని గుర్తించడం, వాస్తవాలను సరిగా ప్రసారం చేయడం ముఖ్యం. మీడియా స్వేచ్ఛ అవసరమే అయినా, జాతీయ భద్రత, సైనిక మనోబలం విషయంలో జాగ్రత్త అవసరం.
తాక్సింగ్ సంఘటన సరిహద్దు సంక్లిష్టతలను, సమాచార వ్యాప్తి బాధ్యతను గుర్తు చేస్తుంది. వాస్తవాలను నిర్ధారించుకుని ప్రచారం చేయడం, జాతీయ గర్వాన్ని కాపాడుకోవడం రెండూ ముఖ్యం. స్వాతంత్య్ర దినోత్సవం జాతి ఐక్యతను చాటే రోజు కావాలి. అనవసర అనుమానాలు, తప్పుడు కథనాలు దాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాలి.