India China Border Dispute: ముల్లును ముల్లుతోనే తీయాలి అనేది సామెత. కొన్ని విషయాల్లో ఇది నిజమే అనిపిస్తుంది. మన పొరుగు దేశం చైనా తరచూ మ్యాప్ మరుస్తూ భారత భూభాగాలను తమవిగా చూపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే 2021లో గాల్వన్ ఘటన జరిగింది. ఆ తర్వాత ఇరుదేశా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏడాది కాలంగా మళ్లీ సంబంధాల పునరుద్ధరణ జరుగుతోంది. ఈ క్రమంలో భారత్ అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 వ్యూహాత్మక ప్రాంతాలు, భౌగోళిక గుర్తులను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లు విడుదల చేసి చైనా చెంప చెల్లుమనిపించింది. ఇది చైనా పదేపదే చేస్తున్న పేర్ల మార్పు ప్రయత్నాలకు ప్రత్యక్ష, శాంతియుతమైన కౌంటర్. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో విడదీయరాని అంతర్భాగమని మరోసారి స్పష్టం చేస్తూ, సరిహద్దు సార్వభౌమత్వాన్ని బలపరిచేలా మ్యాప్‌లు రూపొందించింది.
చర్య నేపథ్యం..
చైనా 2017, 2021, 2023లో అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు తన పేర్లు పెట్టి మ్యాప్‌లు విడుదల చేసింది. ఇలాంటి చర్యలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ, అవి వాస్తవాన్ని మార్చలేవని చెబుతూ వచ్చింది. తాజా మ్యాపింగ్ అరుణాచల్ ప్రభుత్వంతో సంప్రదించి జరిగింది. దీని ద్వారా ఆ ప్రాంతాలను కచ్చితంగా గుర్తించడం, ప్రజల్లో అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యం. ఇది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా భారత్ వైఖరిని బలోపేతం చేస్తుంది.
మ్యాపింగ్ చారిత్రక, వ్యూహాత్మక ప్రాధాన్యత
కొత్తగా గుర్తించిన ప్రాంతాల్లో సరిహద్దు గ్రామాలు, పర్వతాలు, నదులు, సరస్సులు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. 1959లో భారత్–చైనా ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారిన లాంగుఝ ప్రాంతం, వాస్తవాధీన రేఖ సమీపంలో ఉంది. 1962 యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించిన థగ్ లా పాస్ కూడా ఇందులో చేర్చబడింది. తవాంగ్‌లోని అమర జవాన్ జస్వంత్ సింగ్ రావత్ స్మారకం, జస్వంత్ గఢ్, షేర్–ఎ–థాపా మెమోరియల్ వంటి చారిత్రక స్థలాలు అధికారికంగా నమోదయ్యాయి. సైనిక బలగాలు, సామగ్రి తరలింపులో కీలకమైన జైరామ్‌పూర్ పట్టణం, రక్షణపరంగా సున్నితమైన జో లా పర్వతం కూడా భాగం. ఇవన్నీ కేవలం భౌగోళిక గుర్తులుమాత్రమే కావు. భారత సైనిక చరిత్ర, సరిహద్దు రక్షణ వ్యూహంతో ముడిపడి ఉన్నాయి.
చైనా దూకుడుకు అడ్డుకట్ట
చైనా తన మ్యాప్‌ల ద్వారా మానసిక, దౌత్యపరమైన ఒత్తిడి సృష్టించాలని ప్రయత్నిస్తోంది. భారత్ ఈ చర్య ద్వారా అటువంటి ప్రయత్నాలను నిరాకరిస్తూ, తన అధికారిక రికార్డులను బలపరిచింది. అరుణాచల్‌పై ఎటువంటి విదేశీ చర్యలు దురాక్రమణగానే పరిగణిస్తామని భారత్ ఇప్పటికే హెచ్చరించింది. కొత్త మ్యాప్ విద్యా సామగ్రి, ప్రభుత్వ పత్రాలు, అంతర్జాతీయ సూచనలలో భారత్ పేర్లు ప్రామాణికంగా నిలిచేలా చేస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో లాజిస్టిక్స్, సైనిక కదలికలకు ఈ గుర్తింపు ఉపయోగపడుతుంది. చారిత్రక స్మారకాలను అధికారికంగా చేర్చడం దేశభక్తి, జాతీయ స్మృతిని బలపరుస్తుంది. ఇది సరిహద్దు నిర్వహణలో అస్పష్టతను తగ్గించి, భవిష్యత్ చర్చల్లో భారత్ స్థానాన్ని మరింత దృఢం చేస్తుంది.
ఈ మ్యాపింగ్ కేవలం కాగితాల మీద చర్య కాదు. ఇది సార్వభౌమత్వం, చరిత్ర, రక్షణ అవసరాలను కలిపి చూపించే వ్యూహాత్మక అడుగు. చైనా కుతంత్రాలకు శాంతియుతంగా గట్టి సమాధానం ఇవ్వడం ద్వారా భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లోనే ఉంటుందనే సందేశం ఇందులో స్పష్టంగా ఉంది.