Woman Cab Driver: జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. కొందరి జీవితం పూల పాన్పు మాదిరిగా ఉంటే.. మరికొందరికి ముళ్ళ పొద లాగా ఉంటుంది. ఇలాంటప్పుడే మనసుకు సర్ది చెప్పుకోవాలి. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం సొంతం చేసుకోవాలి. ప్రతి అడుగులో సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. ఇలా చేస్తేనే జీవితం మనకు నచ్చినట్టుగా ఉంటుంది. మనం మెచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా నేటి కాలంలో ఆడవాళ్లకు అస్సలు సాధ్యం కాదు. కానీ దీనిని సాధ్యం చేసి చూపించింది ఈ మహిళ .
చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోయారు. అతి కష్టం మీద జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఆ తర్వాత విధి ఆమెకు మరో పరీక్ష పెట్టింది. తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ.. భర్తలో వాళ్ళిద్దరిని చూసుకుందాం అనుకుంటే.. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత అతడు విడాకులు ఇచ్చాడు. ప్రతిరోజు నరకం చూపించేవాడు. తట్టుకోలేక అతడి చర నుంచి బయటికి వచ్చింది. భర్త విడాకులు తీసుకున్న తర్వాత.. ఈసారి మరో పరీక్ష ఆమెకే ఎదురైంది. క్యాన్సర్ వ్యాధి ఆమెను ఇబ్బంది పెట్టేది. కొన్ని సందర్భాలలో ఎందుకు బతికున్నాను అనే విధంగా చేసేది. క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత.. అప్పుల భారం పెరిగిపోయింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియదు. ప్రతిరోజు అప్పులు ఇచ్చిన వారు ఇంటి మీదికి వచ్చి గొడవ చేసేవారు. దీంతో ఆమెకు మనశాంతి ఉండేది కాదు.
ఇలా ప్రతి సందర్భంలో ఒక సమస్య.. దాని నుంచి బయటపడగానే ఇంకొక సమస్య.. జీవితం నరకంలాగా అనిపించేది. చేతిలో రూపాయి ఉండేది కాదు. ఆరోగ్యం సహకరించేది కాదు. పైగా ముగ్గురు పిల్లలు.. అయినప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు. జీవితం మీద భరోసా కోల్పోలేదు. ఆరోగ్యం సహకరించిపోయినప్పటికీ బాధపడలేదు. పైగా సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకొని అడుగులు వేయడం మొదలు పెట్టింది. హైదరాబాద్ నగరంలో క్యాబ్ డ్రైవర్ గా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆమె శ్రమిస్తూ ప్రతిరోజు 4000 వరకు సంపాదిస్తోంది. ఆమె కష్టాలను ఓడించింది. క్యాన్సర్ వ్యాధిని ఓడించింది. అప్పులను తీర్చేసింది. కట్టుకున్నవాడు కాదనుకుంటే.. తన జీవితానికి మరో అర్ధాన్ని వెతుక్కుంది. ఇలా ప్రతి సందర్భంలోనూ తనను తాను పునర్ ఆవిష్కరించుకుంది. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదూ.. నందిని.. ది ఉమెన్ క్యాబ్ డ్రైవర్..