Megha Engineering : హిమాలయాలు.. ప్రకృతి అందాలకు నిలయం. అదే సమయంలో అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులకు చిరునామా. ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, నిరంతరం మారే వాతావరణం, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు.. ఇలాంటి పరిస్థితుల్లో భారీ నిర్మాణాలు చేపట్టడమంటే సాధారణ విషయం కాదు. అలాంటి సవాళ్లనే అధిగమిస్తూ హిమాలయాల గుండెల్లో మరో అద్భుతమైన నిర్మాణానికి బాటలు పడ్డాయి. ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రికుల ప్రయాణాన్ని భవిష్యత్తులో సులభతరం చేయనున్న రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టులో మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఏకంగా 6.59 కిలోమీటర్ల పొడవైన టన్నెల్–14 తవ్వకాలను విజయవంతంగా పూర్తి చేసింది.
పర్వతాల మధ్య రైలు ప్రయాణానికి మరో అడుగు
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి పవిత్ర క్షేత్రాలకు ఏటా లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. అయితే పర్వత ప్రాంతాల్లో రహదారి ప్రయాణం అనేక సవాళ్లతో కూడుకున్నది. ముఖ్యంగా యాత్రా సీజన్‌లో ట్రాఫిక్ రద్దీ, కొండచరియలు విరిగిపడటం, ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టు ఇప్పుడు కీలక దశకు చేరుకుంటోంది. ఇందులో భాగంగా రుద్రప్రయాగ్ జిల్లాలో నిర్మిస్తున్న 6.59 కిలోమీటర్ల టన్నెల్–14 తవ్వకాలు పూర్తయ్యాయి. ఈ సొరంగం అందుబాటులోకి రావడం ప్రాజెక్టు నిర్మాణంలోనే కాకుండా ఉత్తరాఖండ్ రవాణా వ్యవస్థలోనూ ఒక ముఖ్యమైన పరిణామం.
రెండు వైపుల నుంచి తవ్వకాలు.. మధ్యలో కలిసిన ఇంజినీరింగ్ ప్రతిభ
ఈ సొరంగం నిర్మాణం వెనుక ఎన్నో సాంకేతిక సవాళ్లు ఉన్నాయి. మొత్తం 6.59 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌ను రెండు వైపుల నుంచి తవ్వారు. సుమేర్‌పూర్ పోర్టల్ నుంచి 4.7 కిలోమీటర్లు, మారోరా పోర్టల్ నుంచి 1.79 కిలోమీటర్ల మేర పనులు చేపట్టారు. రెండు వైపుల నుంచి సాగిన తవ్వకాలను కచ్చితమైన సాంకేతిక ప్రణాళికతో అనుసంధానించడంతో బ్రేక్‌త్రూ సాధ్యమైంది.
అయితే ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. సుమేర్‌పూర్ వైపు నివాస ప్రాంతాల కింద సుమారు 110 మీటర్ల మేర వదులైన మట్టిలో ట్రిపుల్ ట్రాక్ సొరంగం తవ్వాల్సి వచ్చింది. సొరంగం పైన కేవలం 20 నుంచి 30 మీటర్ల మేర మట్టి, రాతి పొరలు మాత్రమే ఉండటంతో భూమి కుంగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రీ-ఎక్స్‌కవేషన్, మల్టీ-డ్రిఫ్టింగ్ వంటి ప్రత్యేక సాంకేతిక పద్ధతులను ఉపయోగించారు.
మరోవైపు మారోరా ప్రాంతంలో కొండవాలుల స్థిరత్వాన్ని కాపాడటం ఇంజినీర్లకు పెద్ద సవాలుగా మారింది. ఇందుకోసం 30–35 మీటర్ల లోతైన మైక్రోపైల్స్, 15–20 మీటర్ల పొడవైన రాక్ బోల్ట్స్, కన్సాలిడేషన్ గ్రౌటింగ్ వంటి పద్ధతులను అమలు చేశారు. భూకుంగుబాటు, భూసేకరణ, స్థానిక నివాస గృహాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించిన అనంతరం 2024 మార్చిలో ప్రధాన సొరంగం తవ్వకాలు ప్రారంభమయ్యాయి.
యంత్రాలతో పాటు మానవ శ్రమకు పరీక్ష
హిమాలయాల్లో సొరంగ నిర్మాణం అంటే కేవలం భారీ యంత్రాలను ఉపయోగించడం మాత్రమే కాదు. ప్రతి అడుగులోనూ భౌగోళిక పరిస్థితులను అంచనా వేయాల్సి ఉంటుంది. ఎక్కడ మట్టి బలహీనంగా ఉంది? ఎక్కడ రాతి పొరలు ఉన్నాయి? ఎక్కడ కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది? వంటి అంశాలను నిరంతరం పరిశీలిస్తూ పనులు కొనసాగించాల్సి ఉంటుంది.
మారోరా ప్రాంతంలో సుమారు 100 మీటర్ల మేర యాంత్రిక పద్ధతిలో తవ్వకాలు చేపట్టారు. సమీప నివాస ప్రాంతాలకు ఇబ్బందులు కలగకుండా రెండు పోర్టళ్ల వద్ద పగటిపూట మాత్రమే నియంత్రిత బ్లాస్టింగ్ నిర్వహించారు. మరోవైపు సుమేర్‌పూర్ వైపు సుదీర్ఘంగా సాగిన తవ్వకాల నేపథ్యంలో సొరంగంలో గాలి ప్రసరణ, ఉష్ణోగ్రత నియంత్రణ కోసం ప్రత్యేక వెంటిలేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
ఎముకలు కొరికే చలి, భారీ వర్షాలు, పరిమిత స్థలంలో పనిచేయాల్సిన పరిస్థితులు.. ఇలా ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ ఇంజినీర్లు, జియాలజిస్టులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు సమష్టిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో టన్నెల్–14 బ్రేక్‌త్రూ కేవలం నిర్మాణపరమైన విజయమే కాకుండా వందలాది మంది కార్మికుల అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తోంది.
జోజిల తర్వాత మరో కీలక మైలురాయి
హిమాలయ ప్రాంతాల్లో భారీ సొరంగ నిర్మాణాల్లో MEILకు ఇది మరో ముఖ్యమైన విజయంగా చెప్పవచ్చు. ఈ ఏడాది జూన్‌లో శ్రీనగర్–జమ్మూ మధ్య నిరంతర రాకపోకలకు కీలకమైన జోజిల టన్నెల్ నిర్మాణంలోనూ సంస్థ బ్రేక్‌త్రూ సాధించింది. ఇప్పుడు రిషికేశ్–కర్ణప్రయాగ్ ప్రాజెక్టులో టన్నెల్–14 తవ్వకాలను పూర్తి చేయడం ద్వారా క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో నిర్మాణ పనులను చేపట్టగల తమ సాంకేతిక సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది.
చార్‌ధామ్ యాత్ర స్వరూపమే మారనుందా?
ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాఖండ్ పర్యాటక రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. రిషికేశ్ నుంచి కర్ణప్రయాగ్ వరకు రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తే పర్వత ప్రాంతాలకు చేరుకోవడం సులభతరం అవుతుంది. అక్కడి నుంచి రహదారుల ద్వారా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు మెరుగైన రవాణా అనుసంధానం లభిస్తుంది.
ముఖ్యంగా యాత్రా సీజన్‌లో రహదారులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడే అవకాశం ఉంది. ప్రయాణ సమయం, రవాణా ఇబ్బందులు తగ్గడంతో పాటు స్థానిక పర్యాటక రంగం, హోటళ్లు, చిన్న వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మారుమూల పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
అభివృద్ధికి కొత్త దారి.. సవాళ్లపై సాంకేతిక విజయం
ఒకప్పుడు హిమాలయాల వంటి పర్వత ప్రాంతాల్లో రైల్వే మార్గాల నిర్మాణం అత్యంత కష్టమైన పనిగా భావించేవారు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంజినీరింగ్ నైపుణ్యం, నిరంతర శ్రమతో ఇప్పుడు అలాంటి ప్రాంతాల్లోనూ భారీ ప్రాజెక్టులు సాకారమవుతున్నాయి.
రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టులో 6.59 కిలోమీటర్ల టన్నెల్–14 బ్రేక్‌త్రూ ఈ దిశగా మరో కీలక అడుగు. చార్‌ధామ్ యాత్రికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలనే లక్ష్యానికి ఇది మరింత చేరువ చేస్తోంది. పర్వతాలను చీల్చుకుంటూ సాగుతున్న ఈ నిర్మాణం పూర్తయితే ఉత్తరాఖండ్ అభివృద్ధికి కొత్త మార్గం తెరుచుకోవడమే కాకుండా, హిమాలయ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి మరో నూతన అధ్యాయం మొదలైనట్లే.