MG Hector Tomahawk PHEV : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు, ఇంధన ఖర్చుల గురించి ఆలోచించే వినియోగదారులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఇప్పటివరకు ప్రధానంగా టయోటా సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ కార్లు ఈ విభాగంలో కనిపించగా.. ఇప్పుడు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో MG Hector Tomahawk PHEV కొత్త చర్చకు తెరలేపింది. ఎలక్ట్రిక్ కారులో ఉండే నిశ్శబ్ద ప్రయాణాన్ని, పెట్రోల్ వాహనంలో ఉండే సుదూర ప్రయాణ సౌకర్యాన్ని ఒకే కారులో అందించాలన్నది ఎంజీ లక్ష్యం. అయితే ఈ ఎస్‌యూవీ నిజంగానే ఆ అంచనాలను అందుకుందా? రెండు రోజుల పాటు అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వరకు జైపూర్ మీదుగా సాగిన డ్రైవ్ అనుభవం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
ఎలక్ట్రిక్, పెట్రోల్ రెండింటి కలయికే ప్రత్యేకత!
MG Hector Tomahawk PHEV ప్రత్యేకత దాని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్. ఇందులో 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్, 20.5kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 102hp పవర్, 125Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 201hp పవర్, 237Nm టార్క్‌ను అందిస్తుంది. అయితే మొత్తం సిస్టమ్ అవుట్‌పుట్ 198hp పవర్, 230Nm టార్క్‌గా ఉంటుంది.
ఈ కారులో నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ప్యూర్ ఈవీ, సిరీస్ హైబ్రిడ్, పారలల్ హైబ్రిడ్, ఇంజిన్ డైరెక్ట్ డ్రైవ్ మోడ్‌ల ద్వారా అవసరాన్ని బట్టి కారు స్వయంగా పవర్ సోర్స్‌ను మార్చుకుంటుంది. ఈ మార్పు కేవలం 0.1 సెకన్లలో జరుగుతుందని కంపెనీ చెబుతోంది.
పూర్తి ఛార్జింగ్‌తో 115 కిలోమీటర్లకు పైగా ఎలక్ట్రిక్ రేంజ్‌ను అందిస్తుందని ఎంజీ ప్రకటించింది. పెట్రోల్, బ్యాటరీ రెండింటి సహాయంతో లీటరుకు 40 కిలోమీటర్లకు పైగా మైలేజీ, పూర్తి ట్యాంక్‌తో పాటు పూర్తి ఛార్జింగ్ ఉంటే 1,100 కిలోమీటర్లకు పైగా ప్రయాణ పరిధి ఉంటుందని పేర్కొంది.
డ్రైవింగ్‌లో అసలైన బలం ఇదే!
ఈ ఎస్‌యూవీని నడిపినప్పుడు మొదట ఆకట్టుకునేది దాని నిశ్శబ్దం. ముఖ్యంగా ఈవీ మోడ్‌లో ఎలాంటి ఇంజిన్ శబ్దం లేకుండా సాఫీగా ముందుకు సాగుతుంది. నగర ట్రాఫిక్‌లో ప్రయాణించేటప్పుడు ఈ అనుభూతి మరింత బాగుంటుంది. అవసరమైనప్పుడు పెట్రోల్ ఇంజిన్ రంగంలోకి దిగినా.. ఆ మార్పు పెద్దగా తెలియదు. ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ మధ్య సమన్వయం చాలా స్మూత్‌గా ఉంటుంది.
వేగం పెంచాలనుకున్నప్పుడు కూడా ఈ కారు నిరాశపరచదు. ఓవర్‌టేకింగ్ సమయంలో మంచి పవర్ అందిస్తుంది. గేర్‌బాక్స్ స్పందన కూడా వేగంగా ఉండటంతో సిటీ డ్రైవింగ్‌తో పాటు హైవేలపై ప్రయాణం సులభంగా అనిపిస్తుంది. పెద్ద ఎస్‌యూవీ అయినప్పటికీ స్టీరింగ్ నియంత్రణ బాగుండటం, అధిక వేగాల్లో స్థిరంగా ఉండటం మరో ప్లస్ పాయింట్.
ఫీచర్ల విషయంలో తగ్గేదేలే!
కారు లోపలి భాగంలో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనికి తోడు 8.8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ప్రీమియం లెదరెట్ ఫినిషింగ్ క్యాబిన్‌కు ఆధునిక లుక్‌ను అందిస్తాయి.
వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, 256 కలర్స్ యాంబియంట్ లైటింగ్, 10 స్పీకర్ల ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెనుక సన్‌షేడ్స్ కూడా అందించారు.
భద్రత విషయానికి వస్తే ఆరు ఎయిర్‌బ్యాగులు, లెవల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక చిన్న నిరాశ ఎదురవుతుంది. 360 డిగ్రీ కెమెరా స్పష్టత ఈ సెగ్మెంట్‌కు తగిన స్థాయిలో లేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
పెద్ద కుటుంబాలకు సరిపోతుందా?
ఈ ఎస్‌యూవీని ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లో మాత్రమే విక్రయిస్తున్నారు. దీని పొడవు 4,745 మిల్లీమీటర్లు కాగా, వీల్‌బేస్ 2,810 మిల్లీమీటర్లు. మహీంద్రా XUV 7XO, టాటా సఫారీల కంటే ఇది పొడవుగా ఉంటుంది.
మూడు వరుసల సీట్లు ఉపయోగించినప్పుడు బూట్ స్పేస్ 192 లీటర్లు మాత్రమే. మూడో వరుస సీట్లను మడతపెడితే 528 లీటర్లకు పెరుగుతుంది. 52 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఉంది. మొత్తంగా స్థలం, సీటింగ్ పరంగా పెద్ద కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినప్పటికీ.. ప్రయాణ సౌకర్యం విషయంలో మాత్రం కొన్ని లోపాలు బయటపడ్డాయి.
అసలు మైనస్ పాయింట్.. సస్పెన్షన్!
ఈ కారులో అత్యంత నిరాశపరిచిన అంశం రైడ్ క్వాలిటీ. సాధారణ రోడ్లపై ప్రయాణం బాగానే ఉన్నప్పటికీ.. గుంతలు, ఎగుడుదిగుడు రోడ్లపై సస్పెన్షన్ గట్టిగా అనిపిస్తుంది. రోడ్డు మీద ఉండే చిన్న చిన్న లోపాలను కూడా క్యాబిన్‌లోకి ఎక్కువగా చేరవేస్తుంది. ముఖ్యంగా కుటుంబంతో కలిసి సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఇబ్బందిగా మారవచ్చు.
బ్రేకింగ్ విషయంలోనూ మరింత మెరుగుదల అవసరమని డ్రైవింగ్ అనుభవం చెబుతోంది. బ్రేక్ పెడల్ ప్రారంభంలోనే కొంత ఎక్కువ స్పందన చూపించడం, ఆశించిన స్థాయిలో ఫీడ్‌బ్యాక్ లేకపోవడం మైనస్‌గా నిలుస్తాయి.
మరోవైపు కంపెనీ ప్రకటించిన 1,100 కిలోమీటర్ల రేంజ్ వాస్తవ పరిస్థితుల్లో డ్రైవింగ్ వేగం, రోడ్డు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. గంటకు 75-80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఈ అంచనాకు చేరువ కావచ్చని డ్రైవ్ అనుభవం సూచించింది. వేగం పెరిగితే మాత్రం ఈ రేంజ్‌ను అందుకోవడం కష్టమవుతుంది.
ధర ఎంత? ఎవరికి బెస్ట్ ఆప్షన్?
MG Hector Tomahawk PHEV ధరలు రూ.25.70 లక్షల నుంచి రూ.27.80 లక్షల వరకు (ఎక్స్‌షోరూమ్) ఉన్నాయి. అయితే BaaS (Battery as a Service) ఆప్షన్‌తో ప్రారంభ ధరను రూ.21.79 లక్షలకు తగ్గించుకోవచ్చు. ఈ విధానంలో ప్రతి కిలోమీటర్‌కు రూ.3.20 చొప్పున బ్యాటరీ రెంటల్ చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ అదనపు ఖర్చు భారంగా మారే అవకాశం ఉంది.
మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ వంటి ప్రత్యర్థులతో పోలిస్తే ఈ ఎంజీ ఎస్‌యూవీ ధర ఎక్కువగానే ఉంది. అందువల్ల దీన్ని కొనాలనుకునేవారు కేవలం ఫీచర్లు, మైలేజీ మాత్రమే కాకుండా ఛార్జింగ్ సదుపాయం, నిర్వహణ ఖర్చులు, రైడ్ క్వాలిటీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఫైనల్‌గా.. కొనవచ్చా?
MG Hector Tomahawk PHEV ఒక కొత్త తరహా ఎస్‌యూవీ. ఎలక్ట్రిక్ మోడ్‌లో నిశ్శబ్ద ప్రయాణం, అవసరమైనప్పుడు పెట్రోల్ ఇంజిన్ సపోర్ట్, మంచి పవర్, అధునాతన ఫీచర్లు దీని బలాలు. అయితే గట్టి సస్పెన్షన్, బ్రేక్ పెడల్ ఫీల్, 360 డిగ్రీ కెమెరా నాణ్యత వంటి అంశాలు నిరాశపరుస్తాయి.
ఇంట్లోనే ఛార్జింగ్ సదుపాయం ఉండి, ఎక్కువగా నగరాల్లో ఎలక్ట్రిక్ మోడ్‌లో ప్రయాణిస్తూ అప్పుడప్పుడు సుదూర ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఇది ఆసక్తికరమైన ఎంపిక. కానీ కుటుంబంతో కలిసి ప్రయాణించేటప్పుడు సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కొనుగోలు చేసే ముందు చెత్త రోడ్లపై తప్పనిసరిగా టెస్ట్ డ్రైవ్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ కారులో టెక్నాలజీ ఆకట్టుకున్నా.. ప్రయాణ సౌకర్యం విషయంలో ఇంకా మెరుగుదలకు అవకాశం ఉంది.