NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ ‘నీతి ఆయోగ్’ (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన పెట్టుబడుల అనుకూల వాతావరణ సూచిక (Investment Friendliness Index) కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ, మీడియా దుమారానికి దారితీసింది. అయితే, ఈ నివేదికను ఆధారం చేసుకొని కొన్ని ప్రసార మాధ్యమాలు, ముఖ్యంగా సాక్షి మీడియా, వాస్తవాలను పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం విచారకరం.
8 పిల్లర్ల కాన్సెప్ట్.. ఏమిటీ ఇండెక్స్?
రాష్ట్రాల్లో పెట్టుబడుల ఆకర్షణను అంచనా వేయడానికి నీతి ఆయోగ్ ప్రధానంగా 8 కీలక స్తంభాలను (8 Pillars/Concepts) ప్రాతిపదికగా తీసుకుంది. మౌలిక వసతులు, వ్యాపార వాతావరణం,వనరులు, ప్రభుత్వ విధానాలు, సరళీకృత నిబంధనలు, సంస్థాగత వాతావరణం ,ఆర్థిక ఆరోగ్యం,పర్యావరణ స్థితిస్థాపకత.. ఈ ఎనిమిది అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయిస్తారు. అయితే, ఇక్కడ అసలు లోపమంతా ఈ ఇండెక్స్ కోసం ఉపయోగించిన ‘డేటా’ లోనే ఉంది.
పాత డేటా – కొత్త ప్రచారం
నీతి ఆయోగ్ ఈ ర్యాంకులను అధికారికంగా 2024-25 సంవత్సరానికి వర్తింపజేస్తూ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచినప్పటికీ, అందులో వాడిన గణాంకాలన్నీ ఆర్థిక సంవత్సరాలు 2022-23, 2023-24 నాటివి. అంటే, అప్పటి ప్రభుత్వాల హయాంలో ఉన్న పాత డేటాను బట్టి ఈ రోజు ర్యాంకులు డిజైన్ అయ్యాయి.
కానీ సాక్షి మీడియా ఈ కాలం చెల్లిన గణాంకాల ( వాస్తవాన్ని దాచిపెట్టి, ప్రస్తుత కూటమి ప్రభుత్వం లేదా మారిన రాజకీయ సమీకరణల వల్లే ర్యాంకులు ఇలా వచ్చాయంటూ తప్పుడు భాష్యం చెప్పే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనే ఇది 2024-25 నివేదిక అని స్పష్టంగా ఉన్నప్పటికీ, లోపల ఉన్న డేటా మాత్రం రెండేళ్ల క్రితం నాటిదన్న ప్రాథమిక సూత్రాన్ని మీడియా విస్మరించింది, లేదా కావాలనే వక్రీకరించింది.
తెలుగు రాష్ట్రాలకు ర్యాంకులు ఎలా వేశారు?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈ 8 పిల్లర్లలో లభించిన స్కోర్ ఆధారంగా ర్యాంకులు ఖరారు చేశారు. అయితే ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో ఉన్న లోపాలు ఇరు రాష్ట్రాల ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టడం లేదు.
ఆంధ్రప్రదేశ్: గత ప్రభుత్వ హయాంలో (2022-24 మధ్య) మౌలిక వసతుల కల్పన మందగించడం, పారిశ్రామిక విధానాల్లో అనిశ్చితి, మరియు ఆర్థిక క్రమశిక్షణ లోపించడం (Financial Health దెబ్బతినడం) వంటి పాత గణాంకాల ప్రభావం ప్రస్తుత ర్యాంకింగ్‌పై పడింది. ప్రస్తుత ప్రభుత్వం 2024-25 లో తీసుకొస్తున్న కొత్త పాలసీలు, పెట్టుబడుల ఒప్పందాలు ఈ పాత డేటా ఇండెక్స్‌లో ప్రతిఫలించే అవకాశం లేదు.
తెలంగాణ: తెలంగాణకు వనరులు, వ్యాపార వాతావరణంలో మంచి స్కోర్ వచ్చినప్పటికీ, పాత ప్రభుత్వ కాలం నాటి అప్పుల భారం, ఆర్థిక నిర్వహణ లోపాలు (2022-24 నాటి డేటా) ర్యాంకును వెనక్కి నెట్టాయి.
మీడియా బాధ్యత విస్మరిస్తే ఎలా?
ఒక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఆర్థిక సంవత్సరం 2024-25 అని కనిపించినంత మాత్రాన, ఆ కాలంలోనే అద్భుతాలు జరిగిపోయాయనో లేదా విఫలమయ్యారనో ప్రచారం చేయడం పత్రికా విలువలకే ముప్పు. నీతి ఆయోగ్ వంటి సంస్థలు క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి, తాజా గణాంకాలతో నివేదికలు ఇస్తేనే రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. అలా కాకుండా, రెండేళ్ల క్రితం నాటి కాలం చెల్లిన డేటాతో ఈనాటి ప్రగతిని కొలవడం ఎంత తప్పో.. ఆ పాత గణాంకాలను పట్టుకొని నేటి ప్రభుత్వాలపై బురదజల్లడం కూడా అంతే తప్పు. ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కంటే వాస్తవాలకే మీడియా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
