Alla Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) కన్నుమూశారు. విశాఖపట్నంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మృతి వార్తతో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆళ్ల నాని 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఏలూరు నుంచి మరోసారి విజయం సాధించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆళ్ల నాని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఆయన.. నియోజకవర్గంలోనూ తనకంటూ ప్రత్యేక రాజకీయ ముద్ర వేసుకున్నారు.
ఆళ్ల నాని మృతి పట్ల రాజకీయ నాయకులు, అభిమానులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా ఆళ్ల నాని మృతిపై స్పందించారు. ‘‘ఆళ్ల నాని గుండెపోటుతో మృతి చెందారనే సమాచారం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివాదాలకు దూరంగా, అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగే నాని గారి స్మృతిలో నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని లోకేశ్ పేర్కొన్నారు.
ఆళ్ల నాని మృతితో ఏలూరు రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.