JD Lakshmi Narayana : జేడీ లక్ష్మీనారాయణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్సార్ కొడుకు, మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన అక్రమాస్తుల కేసు విచారణతో సీబీఐ డైరెక్టర్‌గా జేడీ లక్ష్మీనారాయణ గుర్తింపు పొందారు. తర్వాత ఉద్యోగం నుంచి స్వచ్ఛంద రిటైర్మెట్ తీసుకున్న ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టారు. 2019 ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపి పోటీ చేశారు. కానీ అప్పటి వైసీపీ ధాటికి ఒక్క సీటు కూడా గెలవలేదు. తర్వాత విశ్లేషకుడిగా, మోటివేటర్‌గా కొనసాగుతూ వచ్చారు. మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అయిన లక్ష్మీనారాయణ ఇప్పుడు కొత్త ఉద్యోగంలో చేరారు. మేఘా ఇంజినీరింగ్ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకాన్ని సంస్థ లింక్డ్‌ఇన్‌లో ప్రకటించింది.
జేడీ లక్ష్మీనారాయణ కెరీర్ ప్రయాణం
ఎన్‌ఐటీ వరంగల్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ బీటెక్, ఐఐటీ మద్రాస్‌లో ఎంటెక్ పూర్తి చేసిన ఆయన అశోక్ లేల్యాండ్ ఆర్ అండ్ డీలో కెరీర్ ప్రారంభించారు. 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్‌గా ముంబైలో అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ఉద్యోగ విరమణ చేశారు. 2006–13 మధ్య సీబీఐలో జగన్ అక్రమాస్తుల కేసు సహా హైప్రొఫైల్ దర్యాప్తులు చేపట్టారు.
రాజకీయ ప్రయత్నాలు..
పదవీవిరమణ తర్వాత జనసేన పార్టీ తరఫు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2023లో జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించారు. తూర్పు గోదావరి ధర్మవరంలో పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం కూడా చేశారు. కుమారుడు ఆల్ ఇండియా సర్వీసులో పనిచేస్తున్నారు.
ఈవీ ట్రాన్స్‌లో కొత్త పాత్ర..
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈవీ ట్రాన్స్ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్. తెలంగాణ ఆర్టీసీ ఒలెక్ట్రా బస్సులు, ముంబై, పుణే, గోవాలోని వాహనాలు తయారు చేస్తుంది. లక్ష్మీనారాయణ ఆర్థిక, కార్యాంగ నిర్వహణ అనుభవం సంస్థ విస్తరణకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల లక్ష్మీనారాయణ భార్య ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లో రూ.2.58 కోట్లు కోల్పోయారు. లాభాలు హామీ ఇచ్చి మోసం చేసినవారిపై జనవరిలో సైబర్ క్రై మ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.