YS Jagan Mohan Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త పరిణామం పార్టీ శ్రేణులకు గందరగోళపరుస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఒక కుదుపు. మాజీ మంత్రి ఆర్కే రోజా మళ్లీ యాక్టివ్ కావడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు అర్థం అవుతోంది. ఆమె సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఆమెను పక్కనపెట్టి బీసీ నేతకు అవకాశం ఇస్తారని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. ఈ విషయంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. నగిరి నియోజకవర్గంలో రోజా అభ్యర్థిత్వం మార్పు చేయాలని ఆయన కోరుతూ వచ్చారు. ఎందుకంటే రోజా ఉంటే పెద్దిరెడ్డికి ఇబ్బందికరమే. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీనియర్ మంత్రిగా పెద్దిరెడ్డి ఉంటారు. అదే జిల్లాలో రోజా మంత్రిగా ఉంటే తనకు ఇబ్బందికరమని పెద్దిరెడ్డికి తెలుసు. అందుకే మొన్నటి ఎన్నికల్లో రోజా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు పెద్దిరెడ్డి. కానీ జగన్ చివరి నిమిషంలో ఆమెకు చాన్స్ ఇచ్చారు. ఈసారి ఆమెను తప్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ ఇప్పుడు రోజాను మళ్ళీ తెరపైకి తేవడంతో పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.
* బిజెపిలో చేరుతారని ప్రచారం..
ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి బిజెపిలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దానికి కారణం లేకపోలేదు. జగన్ స్థాయిలో పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంది కూటమి ప్రభుత్వం. అయితే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేదు కానీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మద్యం కుంభకోణంలో. అయితే ఈ పరిణామాలతో తీవ్ర కలత చెందారు పెద్దిరెడ్డి. మరోవైపు మద్యం కుంభకోణంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కనీసం జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన దాఖలాలు లేవు. అప్పటినుంచి ఏర్పడిన గ్యాప్ అలానే విస్తరించింది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై అటవీ భూముల వ్యవహారం, ఆపై రెవెన్యూ రికార్డుల దహనం కేసు వెంటాడుతోంది. ఇన్ని అవమానాలు పడి జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీలో ఉండాలా.. ఆపై తన ప్రత్యర్థి రోజాను ప్రోత్సహించడం ఎంత మాత్రం మింగుడు పడడం లేదు పెద్దిరెడ్డికి. అందుకే బిజెపిలోకి వెళ్లిపోవాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది.
* రోజా మళ్లీ యాక్టివ్..
గత కొంతకాలంగా పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు రోజా. ఆమెకు నగిరి టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ వెనుకడుగు వేస్తున్నారు అన్న ప్రచారం నేపథ్యంలోనే ఆమె చెన్నైలో ఉండిపోయారన్న టాక్ నడిచింది.. క్రమేపీ ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతారని కూడా ప్రచారం సాగింది. కానీ ఉన్నట్టుండి ఆమెను తిరిగి చిత్తూరు రాజకీయాల్లోకి తేవడం.. మరింత స్వేచ్ఛ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. పెద్దిరెడ్డి పై ప్రోత్సహించేందుకే జగన్ ఆమెను తీసుకొచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ బిజెపిలోకి పెద్దిరెడ్డి ఫ్యామిలీ వెళితే రోజా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా చిత్తూరు జిల్లాలో నాయకత్వ బాధ్యతలు చూస్తారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.