Chandrababu Naidu : టిడిపిలో కొందరి నేతల వైఖరిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. అనవసర వివాదాలు చిక్కుకుంటున్నారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. రాయలసీమకు చెందిన మహిళ ఎమ్మెల్యే ఇదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ చుట్టూ వివాదం అలుముకుంది. అహోబిలం టెండర్ల వివాదం పై చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. ఆ నియోజకవర్గంలో ఆమె భర్త జోక్యం అధికం అవుతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎదుట ఆమె హాజరైనట్లు సమాచారం. అయితే ప్రధానంగా ఆమె భర్త జోక్యం పై ఫిర్యాదులు రావడంతో సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని అఖిలప్రియకు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతోంది. గత కొద్ది రోజులుగా దూకుడుగా వ్యవహరిస్తుండడంతో లేనిపోని వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
* భూమా నాగిరెడ్డి వారసురాలిగా..
భూమా నాగిరెడ్డి రాజకీయ వారసురాలిగా తెరపైకి వచ్చారు అఖిలప్రియ. తల్లి శోభా నాగిరెడ్డి అకాల మరణంతో అఖిల ప్రియ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆమె తండ్రి తో పాటు టిడిపిలోకి వచ్చారు. అప్పటినుంచి ఇదే పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి గెలిచారు. అయితే ఇటీవల అహోబిలం దేవాలయం తలనీలాల టెండర్ల వివాదం నడుస్తోంది. ఈ విషయంలో ఆమె భర్త భార్గవ్ రామ్ జోక్యం పెరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఈ టెండర్ల వివాదంలో స్థానిక జనసేనతో పాటు బిజెపి నాయకులతో విభేదాలు ఏర్పడ్డాయి. పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదులు రావడంతో ఆయన దృష్టి సారించారు. దర్యాప్తు చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. పిలిచి మాట్లాడాలని సూచించడంతో అఖిల ప్రియ పల్లా శ్రీనివాస్ ఎదుట హాజరయ్యారు.
* దూకుడు మనస్తత్వం..
గత కొద్దిరోజులుగా అఖిలప్రియ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది ఆమె. ప్రధానంగా ఆమె భర్త భార్గవ్ రామ్ మ్ జోక్యం పెరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. సొంత కుటుంబ సభ్యులతో సైతం ఆమెకు విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే లేనిపోని వివాదాలు వచ్చి పడుతున్నాయి. అహోబిలం ఆలయ పనుల టెండర్లకు సంబంధించి ఆమెపై అనేక రకాలుగా ఆరోపణలు వచ్చాయి. తమ వారికే దక్కించుకునేలా భార్గవ్ రామ్ ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలతో పల్లా శ్రీనివాస్ రంగంలోకి దిగారు. అఖిలప్రియను పిలిచి మాట్లాడారు. వైఖరి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించినట్లు కూడా చెప్పారని తెలుస్తోంది. అయితే హై కమాండ్ లైన్ దాటి వ్యవహరించమని ఈ సందర్భంగా అఖిల ప్రియ చెప్పడం విశేషం.