Post Lunch Sleepiness: ఉద్యోగం చేసేవారు, వ్యాపారులు, ఇంట్లో ఉండే గృహిణులు మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రపోవాలని చూస్తారు. ఈ భోజనం చేసిన తరువాత కళ్లు మత్తెక్కుతాయి. అయితే ఈ సమయంలో తిన్న వెంటనే నిద్రపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. శరీరంలో శరీరంలోని సహజ జీవక్రియలు, ఆహారపు అలవాట్లు, రక్తంలో చక్కెర స్థాయిల విషయంలో అనేక మార్పులు ఉంటాయి. మరి మధ్యాహ్నం నిద్ర ఎందుకు వస్తుంది? ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మనం ఆహారం తిన్న తర్వాత దాన్ని జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువగా పనిచేస్తుంది. ఈ సమయంలో జీర్ణవ్యవస్థకు ఎక్కువ రక్తప్రసరణ జరుగుతుంది. అలాగే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగి, తర్వాత తగ్గడం వల్ల అలసట, నిద్రమత్తు కలుగుతుంది. అంతేకాదు, కడుపు నిండా తినడం వల్ల శరీరం విశ్రాంతి తీసుకోవాలనే సంకేతాలు మెదడుకు పంపుతుంది. ఈ క్రమంలో వెంటనే నిద్ర వస్తుంది.
ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. భోజనం చేసిన వెంటనే కుర్చీలో కూర్చోవడం లేదా పడుకోవడం మంచిది కాదు. కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం లేదా వీలైతే కొన్ని మెట్లు ఎక్కి దిగడం మంచిది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా సమతుల్యంగా ఉండి నిద్రమత్తు తగ్గుతుంది. అలాగే మధ్యాహ్న భోజనంలో అతిగా తినడం కూడా నిద్రకు ప్రధాన కారణం. అవసరమైనంత మాత్రమే తిని కడుపు పూర్తిగా నింపకుండా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
భోజనంలో కార్బోహైడ్రేట్లు తగ్గించి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే ఎక్కువసేపు శక్తి లభిస్తుంది. పప్పులు, పెరుగు, గుడ్లు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్ ఆహారాలతో పాటు ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్లు చేర్చుకోవాలి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మధ్యాహ్నం నిద్రమత్తును కూడా తగ్గిస్తాయి. శరీరంలో నీటి కొరత ఉన్నా అలసట, బద్ధకం ఎక్కువగా అనిపిస్తుంది. అందువల్ల భోజనం తర్వాత కొద్దిసేపటికి తగినంత నీరు తాగడం మంచిది. అయితే ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగకుండా, అవసరమైనంత పరిమాణంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ భోజనం చేసిన వెంటనే తీవ్రమైన నిద్ర, అలసట, తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.