Slow Eating Benefits: ప్రస్తుత కాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మాత్రమే కాదు.. దీనిని సరైన పద్ధతిలో తినడం కూడా నేర్చుకోవాలి. కొన్ని కారణాల వల్ల బిజీ వాతావరణంలో ఉన్నా చాలా మంది గబగబా తింటున్నారు. సమయం కాపాడుకునేందుకు ఇలా చేస్తున్నా.. ఆ తరువాత అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆహారాన్ని బాగా నమిలి తింటేనే త్వరగా జీర్ణమై ఆరోగ్యకరంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఆహారం నమిలి తినకుండా నేరుగా మింగడం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయి? వీటితో ఎలా అవస్థలు పడాల్సి వస్తుంది.
చాలా మందికి ఉన్న అవగాహన ఏంటంటే.. తిన్న ఆహారం కడుపులోకి వెళ్లిన తరువాత జీర్ణమవుతుందని అనుకుంటారు. కానీ మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ నోటిలోనే ప్రారంభమవుతుంది. ఆహారాన్ని బాగా నమిలినప్పుడు లాలాజలంలో ఉండే ఎంజైములు ఆహారంలోని కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడం మొదలుపెడతాయి. దీంతో కడుపుపై భారం తగ్గి, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అలా కాకుండా ఆహారాన్ని నేరుగా మింగడం వల్ల కడుపులోకి వెళ్లిన తరువాత జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది.
ఆహారాన్ని నెమ్మదిగా.. బాగా నమిలి తింటే మెదడుకు కడుపు నిండిన సంకేతం చేరడానికి తగిన సమయం లభిస్తుంది. సాధారణంగా ఈ సంకేతం రావడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. అందుకే తొందరగా తినేవారు అవసరానికి మించి ఆహారం తీసుకుంటారు. ఇది క్రమంగా బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తుంది. ఆహారాన్ని సరిగా నమలకపోతే అది కడుపులో ఎక్కువసేపు ఉండి అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతుంది.
కొంతమది వైద్యులు చెబుతున్న ప్రకారం.. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల గ్లూకోజ్ శరీరంలోకి క్రమంగా విడుదల అవుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఈ అలవాటు పాటిస్తే రక్తంలో చక్కెర నియంత్రణకు కొంత మేర సహాయపడుతుంది. సరిగా నమలకుండా తినడం వల్ల జీర్ణవ్యవస్థలోని ఇతర అవయవాలు కూడా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కాలేయం, ప్యాంక్రియాస్, పేగులపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో ఇది జీర్ణవ్యవస్థ పనితీరును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఆహారం తీసుకున్న ప్రతీ సారి కనీసం 20 నిమిషాలు కేటాయించడం మంచిది. చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని, ప్రతి ముద్దను బాగా నమిలిన తర్వాత మాత్రమే మింగాలి. తొందరపడకుండా ప్రశాంతంగా భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.