Telangana Crime News: ఒక వేపచెట్టు.. రెండు కుటుంబాలలో తీవ్రమైన విషాదం నింపింది. రెండు కుటుంబాలకు పెద్ద దిక్కును లేకుండా చేసింది. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో జరిగింది.
ఎర్రగడ్డ తండాలో వెంకటేశ్వర్లు.. భూక్య సైదా తన వ్యక్తులు తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య గడచిన 25 సంవత్సరాలుగా ఒక వేపచెట్టు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు ఇటీవల కాలంలో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో శనివారం ఈ రెండు కుటుంబాల మధ్య ఇంటి పక్కన ఉన్న వేపచెట్టు విషయంలో మరోసారి గొడవ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కేసును పక్కదారి పట్టించడానికి ఒక వ్యక్తి తన తండ్రిని చంపడం మరింత దారుణంగా మారింది.
సైదా, వెంకటేశ్వర్లు నివాసాల మధ్య ఒక వేప చెట్టు ఉంది. ఈ వేప చెట్టు విషయంలో గడిచిన 25 సంవత్సరాలుగా ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. 25 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ గొడవకు ఎలాగైనా సరే ఫుల్స్టాప్ పెట్టాలని వెంకటేశ్వర్లు నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో సైదాకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులను పిలిపించి వేప చెట్టును నరికించాడు. ఈ విషయం తెలిసిన సైదా కుమారుడు రాము వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లాడు. వేప చెట్టును ఎలా నరికిస్తారని ప్రశ్నించాడు. దానికి వెంకటేశ్వర్లు గట్టిగానే బదులు చెప్పాడు. దీంతో రాము , వెంకటేశ్వర్ల మధ్య గొడవ జరిగింది. సహనం కోల్పోయిన రాము గొడ్డలితో దాడి చేయడంతో వెంకటేశ్వర్లు చనిపోయాడు. ఇదంతా గమనించిన సైదా అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే రాము విచక్షణ కోల్పోయి గొడ్డలితో తన తండ్రి పై దాడి చేశాడు. దీంతో సైదా కూడా చనిపోయాడు.. వెంకటేశ్వర్లు తో జరిగిన దాడిలో తన తండ్రి చనిపోయాడని చిత్రీకరించడానికి సైదాను రాము చంపేశాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు.
ఇదంతా తెలిసిన గ్రామస్తులు రాము మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. అతని ఇంటి మీద రాళ్లతో దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. గ్రామస్తులను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గ్రామస్తులు రాళ్ల దాడి చేయడంతో ఎస్సైకి తలపగిలింది. గాయపడిన ఎస్ఐని వెంటనే హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు అత్యవసర వైద్య విభాగంలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరవైపు ఇద్దరిని చంపేసిన రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక 25 సంవత్సరాలుగా వేప చెట్టు వ్యవహారంలో జరిగిన గొడవ చివరికి ఇద్దరి ప్రాణాలు తీసింది.