Surkha Case: వయసు వేడిలో చాలామంది యువత తప్పుదారులు పడుతున్నారు. దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఘోరమైన పనులకు పాల్పడుతున్నారు. చివరికి వారిలో పశ్చాత్తాపం కలిగినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈమె జీవితం కూడా అలాంటిదే. చేసిన తప్పు మాములుది కాదు. సభ్య సమాజం ఈమె చేసిన దారుణాన్ని చూసి తలదించుకుంది. చివరికి ఏమైందో తెలియదు.. ఆమెలో ఎటువంటి బాధ ఆవహించిందో అర్థం కాలేదు. కానీ కఠినమైన నిర్ణయం తీసుకుంది.
సంగారెడ్డిలో నర్సిగా పనిచేస్తూ ఉండేది సురేఖ అనే యువతి. ఈమెకు 25 సంవత్సరాలు. కుటుంబం పరంగా ఆర్థిక సమస్యలు లేవు. ఈమెకు ఒక సోదరుడు ఉన్నారు. ఈ క్రమంలో సురేఖ ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగించడం మొదలుపెట్టింది. అతడితోనే వివాహం జరిపించాలని కోరింది. దానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొద్దిరోజులు వారితో సురేఖ మాట్లాడలేదు. ఆ తర్వాత తన ప్రియుడి గురించి వారితో చర్చించడం మొదలుపెట్టింది. అయినప్పటికీ అతడితో పెళ్లికి వారు ఒప్పుకోలేదు. దీంతో సురేఖ వారి మీద ఆగ్రహం పెంచుకుంది. ప్రతిసారి తనను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో వారిని అంతం చేయాలని భావించింది.
సరిగా ఏడు నెలల క్రితం ఇంటికి వెళ్లిన సురేఖ.. తల్లిదండ్రులకు మత్తుమందు ఇచ్చింది. ఆ మత్తులోనే వారిద్దరు చనిపోయారు. ఆ తర్వాత వారిద్దరికీ గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. మహానటి లెవెల్లో ఫెర్ఫార్మన్స్ ఇచ్చింది. కానీ.. ఆమె మాట్లాడిన మాటలకు.. చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ప్రేమికుడితో పెళ్లి జరిపించలేదని ఆగ్రహంతోనే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. గడిచిన ఏడు నెలలుగా ఆమె జైలు శిక్ష అనుభవించింది. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో ఆమె ఒక హాస్టల్లో ఉంటోంది. తన పేరెంట్స్ ను ఏ విధంగానైతే మత్తుమందు ఇచ్చి అంతం చేసిందో.. అదే తీరుగా ఆమె కూడా మత్తుమందు తనకు తాను ఇచ్చుకుని.. బలవన్మరణానికి పాల్పడింది. సురేఖ వ్యవహారం ఎంతోమందికి గుణపాఠం లాగా మారింది.
వయసు వేడిలో కన్న తల్లిదండ్రులనే ఆమె మర్చిపోయింది. మాయదారి ప్రేమ కోసం ఏకంగా వారినే అంతం చేసింది. చివరికి తన ప్రాణాలు తాను తీసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల ఒక కుటుంబం మొత్తం తీరని దుఃఖంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు చనిపోయి.. సోదరి కూడా ఇలా కనుమూయడంతో సురేఖ సోదరుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఇంతటి ఘోరం ఏ కుటుంబానికి రాకూడదని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.