Crocodile Puja : సాధారణంగా మొసలిని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. చాలా దూరం నుంచి వణికిపోతుంటారు. అలాంటి మొసలికి ఓ పూజారి ప్రత్యేకంగా పూజలు చేశాడు. శాస్త్రోక్తంగా పసుపు, కుంకుమ చల్లి.. పూలు సమర్పించారు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ గా మారింది. అంతేకాకుండా చాలా మంది ఈ వీడియోను చూసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ పూజారి మొసలికి ఎందుకు పూజలు చేశాడు? అసలేం జరిగింది?
ఇటీవల వర్షాలు కురవడంతో తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా బీచుపల్లిలోని కృష్ణానదిలో నుంచి ఓ మొసలి బయటకు వచ్చింది. అయితే ఈ మొసలికి స్థానికంగా ఉన్న పూజారి అనిల్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొసలిని వానదేవుడి వాహనంగా భావిస్తారు. అందువల్ల మొసలికి పూజలు చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని అలా చేసినట్లు అనిల్ శర్మ తెలిపాడు.
అయితే బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద మొసలికి పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు ఆసక్తిగా గమనించారు. కొందరు తమ ఫోన్లలో ఈ ఘటనను వీడియోలు, ఫొటోలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మొసలికి పూజలు చేస్తున్న దృశ్యం స్థానికంగా వైరల్‌గా మారింది.ఈ వీడియో వైరల్ కావడంతో ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు. మొసలిని చూస్తే చాలా మంది బయపడుతారు. కానీ ఈ పూజారి ఏకంగా పూజలు నిర్వహించడం ‘మామూలు గుండె కాదు..’ అని అంటున్నారు.
పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. నది ఒడ్డున ఉన్న మొసలిని సురక్షితంగా పట్టుకుని, దానికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం దానిని తిరిగి కృష్ణా నదిలోకి సురక్షితంగా వదిలేశారు.
మొసలి వంటి వన్యప్రాణులు నదీ పరిసరాల్లో కనిపించినప్పుడు వాటికి దగ్గరగా వెళ్లడం, తాకడం లేదా వాటి చుట్టూ గుమిగూడడం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వన్యప్రాణులను వాటి సహజ ఆవాసాల్లోనే ఉండనివ్వడం, అవి జనావాసాల్లోకి వచ్చినప్పుడు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం సురక్షితమైన మార్గం. బీచుపల్లిలోనూ అటవీ అధికారులు మొసలిని సురక్షితంగా నదిలోకి తరలించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మొసలికి పూజలు.. వీడియో వైరల్!
గద్వాల జిల్లా బీచుపల్లిలో కృష్ణానది ఒడ్డుకు కొట్టుకొచ్చిన మొసలికి పురోహితుడు పూజలు చేసిన వీడియో వైరల్‌గా మారింది.
మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించి వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేసినట్లు పూజారి అనిల్‌శర్మ తెలిపారు. పూజల అనంతరం మొసలిని తిరిగి… pic.twitter.com/B1VI8uNHoj
— greatandhra (@greatandhranews) August 9, 2026