Tata Car Sales : భారత కార్ల మార్కెట్లో Tata Motors మరోసారి సత్తా చాటింది. 2026 ఆగస్టులో టాటా మోటార్స్‌కు చెందిన ప్రముఖ ప్యాసింజర్ కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా పంచ్, నెక్సాన్, టియాగో మోడళ్లు కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. ఆగస్టులో పంచ్ ఇండియాలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలవడం విశేషం.
59 శాతం పెరిగిన టాటా కార్ల అమ్మకాలు
ఆగస్టు 2026లో పంచ్, నెక్సాన్, టియాగో, సియెరా, హ్యారియర్, ఆల్ట్రోజ్, సఫారీ, కర్వ్, టిగోర్ వంటి మోడళ్ల మొత్తం అమ్మకాలు 65,253 యూనిట్లకు చేరాయి. గతేడాది ఆగస్టులో ఇవే మోడళ్ల అమ్మకాలు 41,001 యూనిట్లుగా ఉండగా.. ఈసారి 59.15 శాతం వృద్ధి నమోదైంది. జూలై 2026లో నమోదైన 62,611 యూనిట్లతో పోలిస్తే నెలవారీగా కూడా 4.22 శాతం వృద్ధి కనిపించింది.
పంచ్‌దే జోరు.. దాదాపు రెట్టింపైన అమ్మకాలు
టాటా పంచ్, పంచ్ EV కలిపి ఆగస్టులో 21,320 యూనిట్లు విక్రయించాయి. 2025 ఆగస్టులో ఇవి 10,704 యూనిట్లుగా ఉండగా.. తాజాగా 99.18 శాతం YoY వృద్ధి నమోదైంది. జూలైలోని 21,313 యూనిట్లతో పోలిస్తే కేవలం 7 యూనిట్లు మాత్రమే ఎక్కువగా అమ్ముడయ్యాయి.
పంచ్ ఒక్కటే ఈ జాబితాలోని మొత్తం టాటా అమ్మకాల్లో 32.67 శాతం వాటా కలిగి ఉంది. పంచ్, నెక్సాన్ రెండింటినీ కలిపితే టాటా మొత్తం విక్రయాల్లో దాదాపు 61 శాతం వాటా రావడం గమనార్హం.
నెక్సాన్‌కు కూడా భారీ డిమాండ్
పంచ్ తర్వాత నెక్సాన్ కూడా మంచి పనితీరు కనబరిచింది. నెక్సాన్, నెక్సాన్ EV కలిపి ఆగస్టులో 18,431 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో 14,004 యూనిట్లతో పోలిస్తే 31.61 శాతం వృద్ధి నమోదైంది. జూలైలోని 17,471 యూనిట్లతో పోలిస్తే నెలవారీగా 5.49 శాతం పెరుగుదల సాధించింది.
టియాగో అమ్మకాల్లో 62 శాతం వృద్ధి
టియాగో, టియాగో EV కలిపి ఆగస్టులో 8,537 యూనిట్లు విక్రయించాయి. గతేడాది ఆగస్టులో 5,250 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు ఇప్పుడు 62.61 శాతం పెరిగాయి. జూలైలో 7,429 యూనిట్లు అమ్ముడవగా.. ఆగస్టులో నెలవారీగా 14.91 శాతం వృద్ధి నమోదైంది.
సియెరాకు మాత్రం భారీ ఎదురుదెబ్బ
టాటా సియెరా, సియెరా EV కలిపి ఆగస్టులో 5,622 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే డెలివరీలు ప్రారంభమైన జనవరి 2026 తర్వాత ఇదే సియెరాకు అత్యల్ప నెలవారీ అమ్మకాలు.
జూలైలో 6,327 యూనిట్లు అమ్ముడవగా.. ఆగస్టులో 705 యూనిట్లు తగ్గి 11.14 శాతం MoM క్షీణత నమోదైంది. అయినప్పటికీ టాటా కార్ల అమ్మకాల జాబితాలో సియెరా నాలుగో అతిపెద్ద వాటాను కలిగి ఉంది. మొత్తం అమ్మకాల్లో దీని వాటా 8.62 శాతం.
ఇటీవల సియెరా 50,000 యూనిట్ల విక్రయాల మైలురాయిని చేరుకుంది. జూబ్లీ ఎడిషన్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ నెలలో కొత్త సియెరా వేరియంట్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండటంతో.. పండుగ సీజన్‌కు ముందు అమ్మకాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.
హ్యారియర్, సఫారీకి పెరిగిన డిమాండ్
హ్యారియర్, హ్యారియర్ EV కలిపి ఆగస్టులో 3,577 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఆగస్టులో 3,087 యూనిట్లతో పోలిస్తే 15.87 శాతం వృద్ధి నమోదైంది. జూలైలోని 3,301 యూనిట్లతో పోలిస్తే 8.36 శాతం MoM వృద్ధి సాధించింది.
మరోవైపు సఫారీ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. జూలైలో 1,453 యూనిట్లు అమ్ముడవగా.. ఆగస్టులో 1,953 యూనిట్లకు చేరాయి. దీంతో నెలవారీగా 34.41 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఆగస్టులోని 1,489 యూనిట్లతో పోలిస్తే 31.16 శాతం YoY వృద్ధి సాధించింది.
ఆల్ట్రోజ్ అమ్మకాలు తగ్గాయి
టాటా ఆల్ట్రోజ్ మాత్రం వార్షిక ప్రాతిపదికన వెనుకబడింది. ఆగస్టులో 3,047 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఆగస్టులో 3,959 యూనిట్లతో పోలిస్తే 23.04 శాతం క్షీణత నమోదైంది. అయితే జూలైలోని 2,862 యూనిట్లతో పోలిస్తే ఆగస్టులో అమ్మకాలు 6.46 శాతం పెరిగాయి.
కర్వ్, టిగోర్ పరిస్థితి ఇదీ..
కర్వ్, కర్వ్ EV కలిపి ఆగస్టులో 1,904 యూనిట్లు విక్రయించాయి. గతేడాది ఆగస్టులో 1,703 యూనిట్లతో పోలిస్తే 11.80 శాతం వృద్ధి నమోదైంది. జూలైలో 1,697 యూనిట్లతో పోలిస్తే 12.20 శాతం MoM వృద్ధి సాధించింది.
ఇక టిగోర్, టిగోర్ EV కలిపి 862 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో టాటా మోటార్స్‌కు అత్యల్ప వాల్యూమ్ మోడళ్లుగా నిలిచాయి. అయినప్పటికీ గతేడాదితో పోలిస్తే 7.08 శాతం, జూలైతో పోలిస్తే 13.72 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
మొత్తంగా చూస్తే.. ఆగస్టులో టాటా మోటార్స్‌కు పంచ్, నెక్సాన్, టియాగో మోడళ్లు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా పంచ్ అమ్మకాలు దాదాపు రెట్టింపు కావడం కంపెనీ మొత్తం పనితీరుపై భారీ ప్రభావం చూపింది. అయితే సియెరా, ఆల్ట్రోజ్ మోడళ్లలో కనిపించిన ప్రతికూలతను టాటా ఎలా అధిగమిస్తుందనేది రాబోయే పండుగ సీజన్‌లో కీలకంగా మారనుంది.