Megha Engineering : మేఘా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. మనదేశంలోని ప్రధాన రాష్ట్రాల్లోనే కాదు.. ఏకంగా 20 దేశాలలో కార్యకలాపాలు సాగిస్తోంది. కొన్ని దశాబ్దల క్రితం ఒక సాధారణ పైపుల కంపెనీగా ప్రారంభమైంది మేఘా కంపెనీ. పిచ్చిరెడ్డి.. ఆయన మేనల్లుడు కృష్ణారెడ్డి ఈ కంపెనీని నిర్వహిస్తున్నారు.
చేతిలో కీలక ప్రాజెక్టులు
ముఖ్యంగా ఇన్ఫ్రా రంగంలో ఈ కంపెనీ తిరుగులేని స్థాయిలో ఉంది. 2024 ఎన్నికలకు ముందు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల జాబితాలో ఈ సంస్థ రెండవ స్థానంలో ఉంది. కాలేశ్వరం.. పోలవరం హెడ్ వర్క్స్.. జోజిలా అండర్ టన్నెల్.. ఇంకా అనేక రకాల పనులను ఈ కంపెనీ చేపడుతోంది. కృష్ణారెడ్డికి ఇద్దరు కుమారులు. భార్య సుధా రెడ్డి కూడా వ్యాపారంలో ఉన్నారు. ఇటలీలో ఆయిల్ రిగ్గింగ్.. డిఫెన్స్ రంగంలో పరికరాల తయారీ.. ఇంకా అనేక విభాగాలలో కృష్ణారెడ్డి కుమారులు వ్యాపారాలు చేస్తున్నారు. సుధా రెడ్డి కూడా ఫ్యాషన్ ఐకాన్ గా ఉన్నారు. పిచ్చిరెడ్డికి వారసులు లేరు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పైగా ఈ కంపెనీలో ఉన్న 43 శాతం వాటాను అమ్మాలని.. ఆ బాటను అమ్మితే వచ్చే డబ్బును ఇద్దరి కుమార్తెలకు సమానంగా పంచాలని.. 65 సంవత్సరాలకు మించిన వయసులో ఉన్న తాను హాయిగా రెస్టు తీసుకోవాలని పిచ్చి రెడ్డి అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
కృష్ణారెడ్డికి 51 శాతం వాటా
ఈ కంపెనీలో కృష్ణారెడ్డికి ప్రస్తుతం 51 శాతం వాటా ఉంది. మిగతా వాటాను కూడా కొనుగోలు చేస్తే కృష్ణారెడ్డి ఈ కంపెనీకి పూర్తిస్థాయిలో యజమానిగా మారిపోతారు. పిచ్చిరెడ్డి సంబంధించిన వాటాను కొనుగోలు చేయడానికి కృష్ణారెడ్డి అంతర్జాతీయ ప్రైవేట్ క్రెడిట్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం ఈ డీల్ విలువ దాదాపు 15వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ వాటా కొనుగోలు కోసం దాదాపు 6650 కోట్లను ప్రైవేటు ఇన్వెస్టర్ల నుంచి కృష్ణారెడ్డి సమీకరిస్తున్నట్టు సమాచారం.
అతిపెద్ద కంపెనీగా మార్చడానికి..
కంపెనీని కొనుగోలు చేసిన తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ చేయాలని కృష్ణారెడ్డి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. తద్వారా కంపెనీ విలువ పెరుగుతుందని.. గ్లోబల్ వ్యాప్తంగా మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని కృష్ణారెడ్డి భావిస్తున్నారు. ఇన్ఫ్రా విభాగంలో తలనొప్పులు విపరీతంగా ఉంటాయి. ప్రాజెక్టులు తీసుకురావడం.. ప్రభుత్వాలతో మాట్లాడటం.. ఏజెన్సీలను ఒప్పించడం.. ఇంకా తెర వెనుక వ్యవహారాలను సాగించడం అంత ఈజీ కాదు. అయితే 65 ఏళ్ల వయసులో తాను ఈ స్థాయిలో ఇబ్బంది పడబోనని పిచ్చిరెడ్డి నిర్ణయించుకున్నారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పైగా ఇద్దరు కుమార్తెలకు సమానంగా ఆస్తులను పంచి.. విశ్రాంత జీవితాన్ని సుఖంగా గడపాలని పిచ్చిరెడ్డి అనుకుంటున్నారు.
విశ్రాంత జీవితం గడుపుదామని..
పిచ్చిరెడ్డి స్వస్థలం కృష్ణా జిల్లా డోకిపర్రు. ఆ గ్రామంలో అనేక రకాలుగా ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నో ఆలయాలు కట్టించారు. విశ్రాంత జీవితం మొత్తం డోకిపర్రు లోనే గడపాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందువల్లే వాటాలు అమ్మి.. ఇద్దరు కుమార్తెలకు సమానంగా ఆస్తులు పంచి.. తన చేతిలో కొంతమేర నగదు ఉంచుకోవాలని పిచ్చిరెడ్డి భావిస్తున్నట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇన్ని రోజులపాటు పిచ్చిరెడ్డి.. కృష్ణారెడ్డి చేతుల్లో ఉన్న మేఘా కంపెనీ పూర్తిగా కృష్ణారెడ్డి చేతుల్లోకి వెళ్లిపోతుండడం నిజంగా వ్యాపార వర్గాలలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. మరోవైపు నిధుల సమీకరణ క్రమంలో తన చేతిలో ఉన్న కీలక ప్రాజెక్టులను కేకేఆర్ అనే కంపెనీకి మేఘా విక్రయించబోతున్నట్టు తెలుస్తోంది.