Mega Company : మేఘా కంపెనీ దావోస్ వెళ్ళిందట.. అక్కడ తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకుందట.. దాదాపు 15 వేల కోట్ల పెట్టుబడులు పడుతుందట.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి.. భారీగా కంపెనీలు పెట్టేందుకు ఏర్పాటు చేస్తుందట.. ఈ వార్త బయటకు రాగానే భారత రాష్ట్ర సమితి ఒక్కసారిగా రెస్పాండ్ అయింది. అసలు ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని.. ఆ కంపెనీకి ఎటువంటి వర్క్ ఆర్డర్లు ఇవ్వకూడదని డిమాండ్ చేసింది.. ఆ మాటకొస్తే కాలేశ్వరం పనులు.. మొన్నటికి మొన్న కూలిపోయిన సుంకిశాల పనులు చేపట్టింది మేఘా కంపెనీ నే కదా.. ఆ కంపెనీకి పనులు అప్పగించింది అక్షరాల భారత రాష్ట్ర సమితినే కదా.. ఇప్పుడు అధికారం కోల్పోగానే.. పార్లమెంటు ఎన్నికల్లో 0 సీట్లు రాగానే భారత రాష్ట్ర సమితికి అర్జెంటుగా తెలంగాణ ప్రయోజనాలు గుర్తుకొస్తున్నాయి.. తెలంగాణ ఆత్మ అభిమానం గుర్తొస్తోంది.. తెలంగాణ లో జరుగుతున్న అన్యాయం గుర్తుకొస్తోంది.. సరే ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. నిజానికి దావోస్ లో ప్రతి ఏడాది జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వెళ్లేవారు.. ఆర్థిక విశ్లేషకులు అంచనాల ప్రకారం అక్కడి నుంచి కొత్తగా వచ్చే పెట్టుబడులు ఏమీ ఉండవట.. ఎంఓయూలు అంటారు గానీ.. ఎన్ని వర్కౌట్ అయ్యాయో ఎవరూ చెప్పరు.. ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రభుత్వాల ప్రతినిధులు చెప్పగానే కార్పొరేట్ కంపెనీలు తల ఊపవు. తల ఆడించవు. గుడ్డిగా సంతకాలు చేయవు. ఆ రాష్ట్రాలకు తమ ప్రతినిధులను పంపిస్తాయి. ప్రభుత్వం పెద్దలతో అన్ని విషయాలు మాట్లాడతాయి. ఉచితంగా ఏమిస్తారో తెలుసుకుంటాయి. అనుమతులు మొత్తం పొందిన తర్వాతే.. అడ్డంకులు మొత్తం దాటిన తర్వాతే ప్రాజెక్టులను పట్టాలు ఎక్కిస్తాయి.. ఇంతటి తతంగం ఉన్నప్పటికీ.. ఇవన్నీ తెలిసినప్పటికీ రేవంత్ రెడ్డి అక్కడికి ఎలా వెళ్లాడో ఇప్పటికీ అందు పట్టడం లేదు. చంద్రబాబుకు పరకాల ప్రభాకర్ మీడియా ప్రముఖుడిగా ఉన్నప్పుడు ప్రమోషన్ వార్తలు రాయించేవాడని.. దావోస్ లో పాలకూర పప్పు పెట్టారని, బెండకాయ వేపుడు చేశారని, కొత్తిమీర అన్నం వడ్డించారని.. ఇలాంటి వాటితో ఆంధ్ర పెవిలియన్ ఏర్పాటు చేశారని ఓవర్గం మీడియాలో వార్తలు హోరెత్తేవి. అయితేనాడు ఆంధ్రా పెవిలియన్ ఏర్పాటు చేసింది ఓ సమీప రెస్టారెంట్ సమీపంలో అంటే ఇప్పటికీ నమ్మ బుద్ధి కాదు.
నేతలకు మాత్రమే ప్రమోషన్
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వచ్చే పెట్టుబడుల మాటేమిటో గాని.. నేతల ప్రమోషన్ కు మాత్రం ఆ పర్యటన విరివిగా ఉపయోగపడుతోంది. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఎన్నడూ కేసీఆర్ వెళ్లలేదు. అప్పుడు నెంబర్ -2 గా ఉన్న కేటీఆర్ గా మాత్రం ప్రతి ఏడాది వెళ్లేవారు. నమస్తే తెలంగాణ, ఓ వర్గం మీడియా, సోషల్ మీడియా కేటీఆర్ భజన విపరీతంగా చేసేది. రాష్ట్రానికి వేలకోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన నాయకుడిగా కీర్తించేది.. కానీ అందులో ఎన్ని పెట్టుబడులు పెట్టాయి.. ఎన్ని కార్యకలాపాలు సాగిస్తున్నాయనేది ఇప్పటికి చిదంబర రహస్యమే.. ఇప్పుడు కేటీఆర్ అధికారంలో లేడు కాబట్టి.. రేవంత్ రెడ్డిని ఓవర్గం మీడియా కీర్తిస్తోంది. భుజకీర్తులు తొడుగుతోంది. రేవంత్ తో పోల్చితే మీడియా మేనేజింగ్ లో చంద్రబాబు పది ఆకులు ఎక్కువ చదివాడు కాబట్టి.. ఇప్పుడు లోకేష్ కోసం ఓవర్గం మీడియా గట్టిగా పని చేస్తోంది. గడ్డకట్టే చలిలో లోకేష్ పెట్టుబడుల కోసం తిరుగుతున్నాడని.. చంద్రబాబు అయితే కనీసం స్వెటర్ కూడా వేసుకోవడం లేదని.. ఆంధ్రప్రదేశ్ కు వైభవం తేవడానికి వారు కష్టపడుతున్నారని.. ఇలా రాసుకుంటూ పోతున్నాయి ఆ మీడియా సంస్థలు.. తెలుగు రాష్ట్రాల్లోనే నోవాటెల్, పార్క్ హయత్, ఐటీసీ కోహినూర్ లాంటి హోటళ్లు ఉండగా.. మేఘా లాంటి కంపెనీలు ఇక్కడే ఉండగా.. దావోస్ వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏమిటో ఎంతకీ అంతుపట్టడం లేదు..