Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య జరిగి ఆరేళ్లు అవుతోంది. కానీ కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఈ కేసులో ప్రధాన సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. ఇటీవలే బెయిల్ పై వైపు వచ్చారు ఏ 2 నిందితుడు సునీల్ యాదవ్. ఆయన స్వరంలో సైతం మార్పు వస్తోంది. తనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేధింపులకు దిగుతున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అప్రూవర్ గా మారుతానని సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే తాజాగా వివేకానంద రెడ్డి పిఎ కృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: ఏపీలో ఉచిత విద్యుత్.. ఉత్తర్వులు జారీ!
* వివరాలను బయటపెట్టిన పీఏ
2019 మార్చి 15న హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. ఆయన పీఏ గా ఉన్న కృష్ణారెడ్డి ( Krishna Reddy) అప్పట్లో ఏం జరిగిందో మరోసారి వివరించే ప్రయత్నం చేశారు. వివేకానంద రెడ్డి రాసిన ఉత్తరాన్ని దాచి పెట్టే ప్రయత్నం అప్పట్లో సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి చేశారని చెప్పుకొచ్చారు కృష్ణారెడ్డి. ఆ లేఖ ఉంటే తన భర్త రాజశేఖర్ రెడ్డి జైలుకు వెళ్తారని సునీత తనతో వాదించినట్లు కూడా కృష్ణారెడ్డి. తనకు అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వాలని.. సిబిఐ దర్యాప్తులో చెప్పాలని సునీత తనపై ఒత్తిడి చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే కృష్ణారెడ్డి ఎల్లో మీడియా కథనాలపై సైతం స్పందించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలకు విరుద్ధంగా కథనాలు ప్రచురిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
* థర్డ్ డిగ్రీ ప్రయోగం
వివేకా హత్య కేసు విచారణలో సిబిఐ అధికారి రామ్ సింగ్( CBI officer Ram Singh) తనను కొట్టారంటూ మరోసారి ఆరోపణలు చేశారు కృష్ణారెడ్డి. తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని గతంలో నన్ను విపరీతంగా కొట్టారు..థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారంటూ కృష్ణారెడ్డి చెబుతుండడం విశేషం. అయితే ఈ విషయంలో వివేక కుమార్తె సునీత, ఆమె భర్త విపరీతంగా తనపై ఒత్తిడి చేశారని.. తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే తన భర్త జైలుకు వెళ్తాడని సునీత తనపై ఒత్తిడి చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు కృష్ణారెడ్డి. అయితే గతంలో కూడా కృష్ణారెడ్డి ఇటువంటి ఆరోపణలే చేశారు. ఇప్పుడు కూడా ఉన్నఫలంగా మీడియా ముందుకు వచ్చి అదే తరహా ఆరోపణలు చేయడం విశేషం.
* అప్రూవర్ గా సునీల్ యాదవ్
ఇటీవల ఈ కేసులో ఏ 2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్( Sunil Yadav) మీడియా ముందుకు వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను ఈ ఆరేళ్లపాటు మానసికంగా హింసించారని చెప్పుకొచ్చారు. అవసరం అనుకుంటే తాను అప్రూవల్ గా మారి.. ఈ హత్య కేసులో వివరాలు వెల్లడిస్తానని కూడా అన్నారు. తనతో పాటు తన తల్లిని హింసిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సునీల్ యాదవ్ వైఖరి చూస్తుంటే సంచలన విషయాలు బయట పెట్టే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వివేక పిఏ కృష్ణారెడ్డి బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.