Job resignation : చాలామంది ఉద్యోగులు తాము చేస్తున్న జాబ్ నచ్చకుండా ఉంటుంది. ఇలాంటి సమయంలో జాబ్ మానేయాలని అనుకుంటారు. కానీ కుటుంబ పరిస్థితులు, ఈఎంఐ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వంటివి గుర్తుకొస్తాయి. అలాగని ఉద్యోగంలో కొనసాగుదామంటే ప్రతి రోజుకు ఒత్తిడి పెరుగుతుంది.. మరోవైపు అనవసరపు మాటలు పడాల్సి వస్తుంది.. ఇంకోవైపు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం.. ఇలాంటి సమయంలో ఉద్యోగం మానేయడం మంచిదా? లేక కొనసాగడం మంచిదా? అసలు ఏం చేయాలి?
ఉద్యోగ జీవితం చాలా కష్టతరమైన పని. ఎంతో ఓర్పు ఉంటే తప్ప ఈ రంగంలో రాణించలేరు. ఎందుకంటే ఒకవైపు ఆత్మవిశ్వాసం.. మరోవైపు బాధ్యతలు బ్యాలెన్స్ గా ఉంటాయి. ఏది ఒకదానిని నిర్లక్ష్యం చేసినా.. ఉద్యోగి తన జీవితంలో ఫెయిల్ అయినట్లే. అయితే కొందరు తమ కెరీర్ గ్రోత్ పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఉన్న ఉద్యోగాన్ని వదిలి పెట్టాలంటే ధైర్యం చాలదు. అందుకు పరిస్థితులు కూడా అనుకూలించవు. అలాగని కొనసాగుదాం అనుకుంటే నచ్చని వాతావరణం… అయితే ఇలాంటి సమయంలో కొన్ని ప్రణాళిక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవేంటో చూద్దాం..
కార్యాలయ వాతావరణం నచ్చక జాబ్ మానేద్దాం.. అన్న ఆలోచన దాదాపు ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది. కానీ కొందరు ఇక్కడే సరైన నిర్ణయం తీసుకొని సరైన మార్గంలో వెళ్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక జాబ్ నచ్చలేదని అనుకుంటే.. వెంటనే ఆ జాబ్ కు రిజైన్ చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక ఉద్యోగికి కేవలం కార్యాలయ బాధ్యతలు మాత్రమే కాకుండా కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఉన్నఫలంగా ఉద్యోగాన్ని మానేస్తే ఆర్థిక భారం మీద పడి మరింతగా కృంగిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ తిరిగి వద్దామన్నా.. తీసుకునేవారు ఉండరు. అందువల్ల మొట్టమొదటిగా జాబ్ మానేద్దాం అనే ఆలోచన నుంచి.. జాబ్ మానేసిన తర్వాత ఏం చేయాలి? అని ఆలోచనతో మొదలుపెట్టాలి.
ఇందులో భాగంగా ముందుగా ప్రస్తుతం కార్యాలయంలో ఉన్న వాటికంటే బయట ఎక్కువగా సోర్స్ ఉండే స్కిల్స్ నేర్చుకోవడం చాలా అవసరం. ఎలాంటి వాటికి ఎక్కువగా డిమాండ్ ఉంది? ఎలాంటి జాబ్స్ లో గ్రోత్ ఉంది? అందుకోసం ఎలాంటి నైపుణ్యం నేర్చుకోవాలి? అనే విషయాలను తెలుసుకోవాలి. వెంటనే ఆ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత.. జాబ్ కోసం సెర్చ్ చేయాలి. ఒకవేళ కొత్త జాబ్ లో కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలుంటాయి. అయితే వాటిని ఎలా తట్టుకోవాలి? అనే దానిని ముందే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే గ్రోత్ ఉన్నచోట కాస్త ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ఈ ఒత్తిడిని తట్టుకుంటే భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాలను చేరుతారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో ఎలాంటి గ్రోత్ లేకపోయినా ఒత్తిడి ఉంటే మాత్రం ఉద్యోగం మారడమే మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.
మొత్తంగా ఉద్యోగం మానేయాలి అని అనుకునేవారు ముందస్తుగా మరో ఉద్యోగాన్ని సిద్ధం చేసుకున్న తర్వాతనే ఉన్న ఉద్యోగాన్ని మానేయాలి. లేకుంటే తీవ్ర కష్టాల పాలవుతారు.