Pawan greatness YSRCP social media : సోషల్ మీడియా( social media) అకృత్యాలపై పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం చలనం లేదు. ఇప్పటికీ ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం విషప్రచారాన్ని మాత్రమే నమ్ముకుంది. 2019 నుంచి 2024 మధ్య ఆ పార్టీ పాలనను పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. రాజకీయ ప్రత్యర్థులను సైతం వేటాడింది. ప్రభుత్వంపై సానుకూలత ప్రచారం చేస్తూనే వ్యతిరేకులపై ఎన్నో రకాల కుట్రలు చేసింది. ఇప్పుడు కూడా దానిని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చులకన చేసే విధంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లోపాన్ని బయటపెట్టింది. ఆపై పవన్ గొప్పతనాన్ని బయటకు వచ్చేలా చేసింది.
* వ్యక్తిగత సిబ్బంది కోరిక మేరకు..
ఎంతటి పెద్ద నాయకుడు అయినా వారికి వ్యక్తిగత జీవితం అంటూ ఒకటి ఉంటుంది. చాలామంది సన్నిహితులు కూడా ఉంటారు. కుటుంబ సభ్యులు, బంధువుల బాగోగులు చూసుకోవడం కూడా వారి విధి. అటువంటి పనుల్లో ముందుంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan). తనతో పాటు పదిమంది బతకాలనే తత్వం పవన్ కళ్యాణ్ ది. అందుకే తన వద్ద పనిచేసే చిన్న ఉద్యోగి సొంతంగా ఎదగాలని సూచించారు. మేకప్ వేసే బృందంలో ఒకరు సొంతంగా సెలూన్ ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించాలని భావించారు. అందుకే పవన్ కళ్యాణ్ కు విన్నవించారు. దీంతో పవన్ వచ్చి సెలూన్ ప్రారంభించేసరికి సదరు వ్యక్తి ఎంతగానో ఆనందించారు. అయితే ఈయన ఒక్క విషయంలోనే కాదు పవన్ కళ్యాణ్ తన వద్ద పనిచేసే వారి విషయంలో చాలా ఉదారంగా ఉంటారు. ఇది చాలా సందర్భాల్లో కూడా బయటపడింది. తాజాగా ఈ సెలూన్ ప్రారంభానికి వచ్చి తన వద్ద పనిచేసే వారి విషయంలో ఎంత ఉదారంగా ఉంటారో తెలియచెప్పారు పవన్ కళ్యాణ్.
* సెలూన్లు ప్రారంభిస్తున్నారు అంటూ..
అయితే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ సోషల్ మీడియాకు ఇది తప్పుగా కనిపించింది. తెలంగాణలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో పోల్చుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉంటూ విదేశాలకు వెళ్లి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని చూపే ప్రయత్నం చేశారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం సెలూన్లు ఓపెన్ చేస్తూ కాలం గడిపేస్తున్నారు అంటూ ప్రచారం చేశారు. అయితే ఇక్కడే అడ్డంగా బుక్కయ్యారు. మల్లు భట్టి విక్రమార్క సాధించిన పెట్టుబడులు ఏంటో చెప్పలేదు. ఆయన ఏ దేశానికి వెళ్లారో చెప్పడం లేదు. ఏ కంపెనీ ని తీసుకొచ్చారో చెప్పలేదు. అయితే తన వద్ద పనిచేస్తున్న వ్యక్తి కోరికను మన్నించి వచ్చారు పవన్ కళ్యాణ్. కానీ ఆ గొప్పతనాన్ని మరిచిపోయి.. పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎంతో పోల్చి పోస్ట్ పెట్టడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
* పెట్టుబడులు తేలేదంటూ ప్రచారం..
పవన్ కళ్యాణ్ తాను విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తున్నానని ఎన్నడూ చెప్పలేదు. తాను నిర్వర్తిస్తున్న మంత్రి పదవులకు మాత్రం ఆయన న్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం సజావుగా నడిచేందుకు తనదైన పాత్ర పోషిస్తున్నారు. గత ఏడాది కాలంగా ఏపీకి పెట్టుబడులు వస్తుండడం వెనుక పవన్ పాత్ర కూడా ఉంది. కానీ అది తెలియని వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేస్తుండడం పై మాత్రం నెటిజెన్లు మండిపడుతున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని పవన్ కళ్యాణ్ ఓ చిన్న వ్యక్తి సెలూన్ ప్రారంభానికి వెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది. అందుకు జనసైనికులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.