YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు తమ వైఖరితో కేసులు కొని తెచ్చుకుంటున్నారు. జైలు పాలవుతున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ పరిస్థితి ఉంది. వారి వైఖరితో అనవసరంగా పార్టీని డ్యామేజ్ చేస్తున్నారన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో ఉంది. అయితే నేతలను అధినేత సమర్ధిస్తుండడం కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తోంది ప్రజల్లో. ప్రజా సమస్యల విషయంలో ఈ స్థాయిలో స్పందిస్తూ ఉంటే బాగుండేది కానీ.. నేతలతో పాటు వారి కుటుంబ సభ్యుల వైఖరిని అడ్డగోలుగా సమర్థిస్తున్న నేతల విషయంలో జగన్ అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ పట్ల ప్రజల్లో ఒక రకమైన భావన కనిపిస్తోంది. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జగన్ శ్రీకాకుళం పర్యటనలో భాగంగా ఓ పరిణామంతో ఇప్పుడు.. మరో నేత ఇరకాటంలో పడ్డారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
* అప్పలరాజు పరామర్శ కోసం..
మాజీ మంత్రి అప్పలరాజు ప్రస్తుతం శ్రీకాకుళం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తన కుమారుడు బైక్ ప్రమాదానికి సంబంధించి కేసును తప్పుదోవ పట్టించినందుకుగాను పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి జైల్లో పెట్టారు. దానిని తప్పుపడుతూ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష అంటూ ఆరోపణలు చేశారు. జైల్లో ఉన్న అప్పలరాజును పరామర్శించేందుకు ఏకంగా ఒక బల ప్రదర్శనకు దిగారు. విశాఖ నుంచి శ్రీకాకుళం జైలు వరకు రాజకీయ ప్రచార సభలు మాదిరిగా పర్యటనలు చేశారు. చివరకు జైలు వద్దకు వెళ్లి సమయం ముగియడంతో నిబంధనలు అడ్డంకిగా మారాయి. అప్పలరాజును కలవకుండా వెనుతిరి గారు.
* మహిళా ఎస్సై పై అనుచిత ప్రవర్తన..
అయితే జగన్ పర్యటన మూలంగా తలెత్తిన పరిణామం ఒకటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసింది. జగన్ పర్యటనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓవర్ యాక్షన్ చేశాయి. ఓ మహిళా పోలీస్ అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ మహిళ ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించి పోలీసులు చింతాడ రవికుమార్ ను బాధ్యుడిగా చేశారు. ఎందుకంటే ఆ వీడియోలలో చింతా రవికుమార్ స్పష్టంగా కనిపించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇప్పుడు రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
* వరుసగా కేసులు..
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలు ఒక్కొక్కరు కేసులు బారిన పడుతుండడం.. అనుచితంగా ప్రవర్తిస్తుండడం సొంత పార్టీ శ్రేణులకే మింగుడు పడడం లేదు. కుమారుడు రోడ్డు ప్రమాదానికి బాధ్యుడై ఒకరి ప్రాణానికి హాని కలిగిస్తే దానిని దాచి.. కేసును పక్కదారి పట్టించే క్రమంలో అడ్డంగా బుక్కయ్యారు అప్పలరాజు. మరోవైపు తప్పుడు ధృవీకరణ పత్రాలతో నాలుగు కోట్ల రూపాయల భూమిని తన కుమారుడు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని అడ్డంగా దొరికిపోయారు తమ్మినేని సీతారాం. ఇప్పుడు ఓ మహిళ ఎస్సై విషయంలో అనుచిత ప్రవర్తనలో రవికుమార్ సైతం దొరికిపోవడంతో వైసీపీలో గందరగోళం నెలకొంది. శ్రీకాకుళం వైసీపీ అంటే ఇప్పుడు అదోలా చూస్తున్నారు ప్రజలు.