YS Jagan: రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదు కాదు. పులివెందుల వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. అక్కడ వైయస్ కుటుంబం నుంచి ఎవరు నిలబడినా సరే గెలవడం పక్కా. ప్రత్యర్థులకు చోటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైఎస్ కుటుంబం పునాదులు కదిలిపోతున్నాయి. దీనికి వైసిపి రకరకాల వక్రీకరణలు చేసినప్పటికీ.. సొంత మీడియాలో ఏవేవో రాసుకున్నప్పటికీ.. అవేవీ వాస్తవాలు కావని వైసీపీ కార్యకర్తలే అంటున్నారు..
తాజాగా ఊటుకూరు సుబ్బరామయ్య అనే ఒక కార్యకర్త.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ని దైవంగా కొలిచే అభిమాని ఒక లేఖ రాశారు. అందులో అనేక విషయాలను ప్రస్తావించారు. ఆ లేఖలో ఉన్న అంశాలు వైసిపి దుస్థితికి.. జగన్.. అవినాష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు.. వివేకానంద రెడ్డి మరణం.. షర్మిలను దూరం చేసుకున్న దౌర్భాగ్యం.. ఇవన్నీ కూడా ఆయన కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆయన రాసిన ప్రతి వాక్యంలోనూ నిజాలే ఉన్నాయి. ఈ విషయాన్ని వైసిపి లో ఉన్న కీలక నాయకులు సైతం ఒప్పుకుంటున్నారు. వాస్తవానికి కడపలో ఎందుకు ఇలా వైసిపి పరిస్థితి మారిపోయింది.. దీనికి కారణాలేమిటి.. సుబ్బరామయ్య రాసిన వాక్యాల్లోనే చూద్దాం.
“రాజశేఖర్ రెడ్డి మా గుండెల్లో కొలువై ఉన్న నాయకుడు. ఆయన పాదాలకు నమస్కరిస్తున్నాం. గడిచిన 50 సంవత్సరాలుగా రాజారెడ్డి నుంచే మా రక్తాన్ని.. చెమటను ధారపోసాం. వయసుకు కుటుంబానికి అండగా నిలిచాము. రాజశేఖర్ రెడ్డి అందించిన సంక్షేమం.. ఆయన రాజసంతో కూడిన నాయకత్వాన్ని దైవ సమానంగా పూజించాం. ఆయన చూపించిన బాటలో మా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నడిచాం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాం. రాశేఖర్ రెడ్డి తనయుడుగా జగన్ మమ్మల్ని నడిపిస్తారని అనుకున్నాం. పార్టీ కోసం శ్రమించాం. కానీ కడప జిల్లాలో పార్టీకి పట్టిన గతి చూస్తే గుండెలు రగిలిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో కష్టపడిన మాలాంటి కార్యకర్తల ఆవేదన ఎవరికీ చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక కంటనీరు పెడుతున్నాం..
అప్పటి రోజుల్లో పార్టీ కార్యక్రమాలను.. జిల్లా వ్యవహారాలను వివేకానంద రెడ్డి.. షర్మిల చూసుకునేవారు. పార్టీ నాయకులకు అండగా నిలిచేవారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడు కడప, పులివెందుల బాధ్యతలను వివేకానంద రెడ్డి చూసుకునేవారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చిన సరే ఆయన ధైర్యం చెప్పేవారు. భరోసా కలిగించేవారు. ఆయన నిరంతరం పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండేవారు. షర్మిల మా వద్దకు వస్తే ఆప్యాయంగా పలకరించేవారు. సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు మాట్లాడేవారు. క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేవారు. వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత.. షర్మిల పార్టీకి దూరమైన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ వైఎస్ భాస్కర్ రెడ్డి.. వైయస్ అవినాష్ రెడ్డి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను.. వైఎస్ అభిమానులను పట్టించుకోవడం లేదు. కష్టపడిన కార్యకర్తలను మాటలను లెక్కచేయకుండా.. తమకు ఇష్టం వచ్చిన వారికే పనులు.. నిధులు కేటాయిస్తున్నారు. దీనివల్ల నిజమైన కార్యకర్తలు నష్టపోతున్నారు.
ఆర్థికంగా బలపడిన వారు పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారి వ్యాపారాలు చూసుకుంటున్నారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీకి ఇంతటి దుస్థితి రావడానికి ప్రధాన కారణం అవినాష్ రెడ్డి. ఆయన వల్లే స్థానిక ఎన్నికలు.. జడ్పిటిసి.. ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవలసి వచ్చింది. భారీగా మెజారిటీగా వచ్చే మండలాలలో కూడా ఓటు బ్యాంకు లేకుండా పోయింది. అవినాష్ రెడ్డి తనకు తొత్తులుగా ఉన్న వారికోసం పులివెందుల.. జమ్మలమడుగు.. రైల్వే కోడూరు.. ప్రొద్దుటూరు.. బద్వేలు.. కమలాపురం నియోజకవర్గం వైఎస్ అభిమానులను పూర్తిగా నాశనం చేశారు. నియోజకవర్గాలలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గౌరవం దక్కడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి గెలిచినప్పుడు కూడా కార్యకర్తలలో ఆర్థిక ఎదుగుదల అనేది లేదు. కార్యకర్తలు ఆర్థికంగా నష్టపోయి.. అప్పలపాలయ్యారు. అవినాష్ రెడ్డి అనాలోచిత.. సొంత నిర్ణయాల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. వివేకానంద రెడ్డి చనిపోవడం.. షర్మిల పార్టీకి దూరం కావడంతోనే ఈ దుస్థితి దాపరిచిందని”సుబ్బరామయ్య తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ఇప్పుడు కడప జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.