RK Kotha Paluku:ఈసారి చంద్రబాబు ప్రస్తావన లేదు. జగన్ గురించి విమర్శ లేదు. రేవంత్ గురించి ప్రశంస లేదు. ఇంకా చెప్పాలంటే రాజకీయాలను పక్కనపెట్టి జర్నలిజాన్ని ప్రక్షాళన చేసే దిశగా ఆంధ్ర జ్యోతి పత్రిక చైర్మన్ వేమూరి రాధాకృష్ణ నడుం బిగించారు. ఇవి వ్యవస్థ మొత్తం నాశనం అవుతోంది.. బాగు చేయాలి.. నాతో కలిసి రండి.. నాతో వచ్చే వారెవరు.. అనే లెవెల్లో ఆయన కొత్త పలుకు వ్యాసంలో రాసుకొచ్చారు.
రాజకీయాల ప్రస్తావన లేకుండా రాధాకృష్ణ వ్యాసం సాగిపోవడం నిజంగా ఆశ్చర్యకరం. సోషల్ మీడియా వల్ల వ్యవస్థలు మొత్తం ప్రభావానికి గురవుతున్నాయట.. సోషల్ మీడియా వల్ల ప్రధాన మీడియా సంస్థలను దేబిరించే అవకాశం లేకుండా పోతోందట. సామాన్యులు సైతం తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తున్నారట. మిగతా రంగాలలో అవాంఛనీయ పరిణామాల మాదిరిగానే.. సోషల్ మీడియాకు వల్ల మీడియాలో కూడా వస్తున్నాయట. రాజకీయ పార్టీల వల్ల ఇదంతా జరుగుతోందట. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తున్నారట. వాస్తవానికి రాధాకృష్ణ బాధలో కొంత నిజం ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా అనేది ఇంత బలంగా లేకపోతే మీడియా సంస్థలు రాసిందే నిజమనుకునేవారు జనాలు. తద్వారా నిజాలు మరుగున పడిపోయి.. అబద్ధాలు రాజ్యమేలేవి.
సోషల్ మీడియాను నిందిస్తున్న రాధాకృష్ణ.. మీడియా సంస్థల కున్న రాజకీయ పోకడల గురించి ఎందుకు మాట్లాడరు. రాజకీయరంగుల గురించి ఎందుకు వ్యాఖ్యలు చేయరు.. అసలు మీడియా సంస్థల అధినేతలకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఎందుకు ఉండాలి.. రాజకీయ పార్టీ నాయకులతో వ్యక్తిగత వ్యవహారాలు ఎందుకు కొనసాగించాలి.. దీనికి రాధాకృష్ణ ఎందుకు సమాధానం చెప్పరు. మీడియా ముసుగులో తెరవెనక కార్యకలాపాలు చేస్తూ.. రాజకీయ పార్టీలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఊడిగం చేసే మీడియా సంస్థలను ప్రజలు ఎందుకు నమ్మాలి. అసలు వారు రాస్తున్న రాతలను ఎందుకు విశ్వసించాలి..
తన ఆంధ్రజ్యోతి పత్రికలో జగన్ గురించి ఏకపక్ష వ్యతిరేకంగా రాధాకృష్ణ ఎందుకు రాస్తారు.. అదే ధోరణి మిగతా పార్టీల విషయంలో ఎందుకు పాటించరు.. కొంతమంది నాయకులకు ఆయన పత్రికలో సానుకూలంగా మాత్రమే ఎందుకు కథనాలు వస్తాయి.. అందరి విషయంలో కూడా రాధాకృష్ణ అలానే ఉండాలి కదా.. ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే.. సోషల్ మీడియా వల్ల చాలామందికి అసలు విషయాలు తెలుస్తున్నాయి. ఇందులో రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను తమకు అస్త్రంలాగా వాడుకోవడం అసలైన విషాదం. కాకపోతే ఆ సోషల్ మీడియా ద్వారానే వెలుగులోకి వచ్చిన వ్యక్తులతో ఏబీఎన్ డిబేట్ లు కూడా నిర్వహిస్తోంది. డిబేట్లో కూర్చోబెడుతోంది. ఇంతకంటే మహాపాతకం మరొకటి ఏముంటుంది. రాధాకృష్ణకు ఫ్యూచర్ సిటీలో వందల కోట్ల విలువైన భూములు ఇచ్చారని ఇటీవల గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో చర్చ నడిచింది. అది రాధాకృష్ణకు బాగా డ్యామేజి కలిగించినట్లు ఉంది. అందువల్లే ఆయన తన బాధను ఈ రూపంలో బయటపెట్టారు. మాకు ఎటువంటి భూములు కేటాయించలేదని సీఎంఓ నుంచి ఒక ప్రకటన ఇప్పించి ఉంటే బాగుండేది కదా సార్. ఆ మాత్రం దానికి ఇంతటి శోష దేనికి ఆర్కే సార్.. వృధా ప్రయాస కాకపోతే..