Gannavaram Politics: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కొన్నినియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోగా.. వైసీపీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
84 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులకు 39 స్థానాలు
గన్నవరం నియోజకవర్గంలో మొత్తం 84 గ్రామపంచాయతీలున్నాయి. ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు 33 స్థానాల్లో గెలుపొందగా, వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 39 చోట్ల విజయం సాధించారు. జనసేన ఒకటి, బీజేపీ ఒకటి, స్వతంత్రులు 10 స్థానాలను దక్కించుకున్నారు. మొత్తంగా టీడీపీ కంటే వైసీపీ మద్దతుదారులే ఎక్కువ పంచాయతీలను కైవసం చేసుకున్నారు. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న గన్నవరం మండలంలో మొత్తం 21 పంచాయతీలున్నాయి. ఇందులో టీడీపీ మద్దతుదారులు ఐదుస్థానాల్లో , జనసేన, బీజేపీ ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. స్వతంత్రులు రెండు స్థానాలను దక్కించుకోగా, వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకంగా 12 పంచాయతీలను గెలుచుకున్నారు.
స్థానిక నాయకత్వంపై చర్చ
గన్నవరం నియోజకవర్గంలో వచ్చిన ఫలితాలు స్థానిక టీడీపీ నాయకత్వంపై చర్చకు దారి తీశాయి. కీలక నేతల మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపిక , స్థానిక నాయకులతో సంబంధాలు వంటి అంశాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించాయి. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ వ్యవహారశైలిపై కూడా స్థానికంగా వ్యతిరేక ధోరణి వినిపిస్తోందని తెలుస్తోంది. కార్యకర్తలు కూడా ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మైలవరం నియోజకవర్గంలో..
మైలవరం నియోజకవర్గంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అసక్తికరంగా ఉన్నాయి. మొత్తం 64 గ్రామపంచాయతీలున్నాయి. టీడీపీ మద్దతుదారులు 35, వైసీపీ మద్దతుదారులు 21 స్థానాల్లో గెలిచారు. జనసేన రెండు, స్వతంత్రులు ఆరు స్థానాలలో విజయాలు సాధించారు. మైలవరం మండలంలోని 13 పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు ఐదు, జనసేన ఒకటి, వైసీపీ మద్దతుదారులు ఏడుస్థానాలను గెలుచుకున్నారు. మొత్తంగా గన్నవరం, మైలవరం వంటి నియోజకవర్గాల్లో వచ్చిన పంచాయతీ ఫలితాలు, కూటమి పార్టీలలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఫలితాల నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాలపై చంద్రబాబు, నారా లోకేష్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. ‘ఆ ఎమ్మెల్యేలు సీతయ్య తాతలు.. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి మాములు దెబ్బకాదు..లోకేష్, చంద్రబాబు ఫోకస్ చేయాల్సిందే’ అని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు.