Vasupalli Ganesh: బోడి గుండు కి.. మోకాలికి ముడి పెట్టడం అంటే ఇదే కాబోలు.. ఎక్కడో జరుగుతున్న వ్యవహారాన్ని.. సంబంధంలేని విషయాన్ని కలిపి మాట్లాడడం అంటే ఇదే అనుకుంటా. ఈ మాటలు మాట్లాడింది ఎవరో గాలికి పోయే వ్యక్తి అనుకుంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఒక మాజీ ఎమ్మెల్యే.. పైగా ఆయనకు రాజకీయ అనుభవం ఉంది. చాలా సంవత్సరాలుగా రాజకీయాలు సాగిస్తున్న నేర్పరితనం ఆయనకు ఉంది. కానీ అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం.
ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చడానికి కూటమి ప్రభుత్వం భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసింది. దీనిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించింది. తద్వారా రాకపోకలకు అనువైన వాతావరణాన్ని సృష్టించింది. దీనికి తోడు ఉత్తరాంధ్ర భౌగోళిక స్వరూపాన్ని మొత్తంగా మార్చేందుకు కంకణం కట్టుకుంది. ఒకవేళ ఈ విమానాశ్రయం నిర్మాణంలో ఏవైనా లోపాలు జరిగితే.. నాణ్యత సరిగా లేకపోతే బాధ్యతాయుతమైన హక్కు కలిగిన వైసిపి ప్రశ్నించవచ్చు. పూర్తిగా ఆధారాలతో ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లవచ్చు. అవసరమైతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఇవేవీ వైసీపీ చేయలేదు. చేసే అవకాశం కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు.
ఏదో ఒక రాయి వేయాలి.. ఏదో ఒక విధంగా విమర్శ చేయాలి కాబట్టి వైసిపి రంగంలోకి వచ్చింది. వైసిపి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ భోగాపురం విమానాశ్రయం మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అసలు అంత అందంగా భోగాపురం విమానాశ్రయాన్ని ఎందుకు రూపొందించారని ఆయన ప్రశ్నించారు. అక్కడితోనే గణేష్ ఆగిపోలేదు.. ఐశ్వర్యరాయ్ అందంగా ఉంటుంది.. అందంగా ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఆమెతో అభిషేక్ బచ్చన్ కాపురం చేయడం లేదు. అందం ఎవరికి కావాలండి.. ఎవరికి అవసరం అంటూ తలా తోక లేకుండా మాట్లాడారు. అసలు ఐశ్వర్యరాయ్ కి భోగాపురం విమానాశ్రయానికి ఏంటి సంబంధం.. ఐశ్వర్యరాయ్ ప్రపంచ స్థాయి అందగత్తె. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆమెను పెళ్లి చేసుకున్న అభిషేక్ బచ్చన్.. కాపురం చేయాలా వద్దా అనేది ఆయన ఇష్టం. ఐశ్వర్యరాయ్ కి ఇష్టమైతే అభిషేక్ బచ్చన్ తో కలిసి ఉంటుంది. లేకుంటే దూరంగా ఉంటుంది. ఇందులో వైసీపీకి వచ్చిన నష్టం ఏంటి.. గణేష్ కు ఎదురైన ఇబ్బంది ఏంటి . కాస్తైనా సోయి ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావాలి కదా..
భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు. ఇందులో ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ నిర్మించారు. ఏపీ సంస్కృతికి పెద్దపీట వేశారు. ఉత్తరాంధ్రలో లభించే అటవీ ఉత్పత్తులు.. పర్యాటక ప్రాంతాలు.. ఇతర సౌలభ్యాల మీద ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టారు. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉత్తరాంధ్రకు బ్రాండ్ ఇమేజ్ కల్పించారు. విశాఖపట్నం కి ఎమ్మెల్యేగా పనిచేసిన గణేష్ బాబు కు ఈ విషయం తెలియదా.. కూటమి ప్రభుత్వం చేసిన మంచిని చూడలేకపోతున్నారా.. అభివృద్ధి అనేది ఆయనకు కళ్ళకు కనిపించడం లేదా.. అందువల్లే ఇలాంటి నేలబారు విమర్శలు చేస్తున్నారా అంటూ టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.