Vijayasai Reddy: క్రియాశీలక రాజకీయాల్లోకి మళ్లీ వస్తానంటూ సూచనప్రాయంగా వెల్లడించారు విజయసాయిరెడ్డి. గతంలోనూ ఆయన ప్రత్యేక ప్రకటన చేశారు. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని చెప్పుకొచ్చారు. ముందుగా మీడియాని ఏర్పాటు చేసి మళ్లీ యాక్టివ్ అవుతానని చెప్పారు. అయితే ఇప్పుడు డిజిటల్ మీడియాను స్థాపించి రంగంలోకి దిగబోతున్నారు. ఇంతలోనే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన అడుగులు వైసీపీ వైపు పడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే మిగతా పార్టీల్లో చేరేందుకు అనుకూలమైన వాతావరణం లేదు. సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అందుకే ఆయన తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే వైసీపీకి కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి అవసరం ఉందన్న టాక్ నడుస్తోంది.
* జగన్ కు అండగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయ్యారని చెప్పవచ్చు. గతం మాదిరిగా తల్లితోపాటు చెల్లెలు ఆయన వద్ద లేరు. ఎంతోకొంత సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి కొంత అండగా నిలుస్తున్నారు. అయితే రాష్ట్ర రాజకీయాల వరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఓకే. కానీ జాతీయస్థాయిలో అవసరాలను తీర్చే నాయకులు లేరు. వై వి సుబ్బారెడ్డి లో అంత సమర్థత లేదు. అందుకే విజయసాయిరెడ్డి అవసరం ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడినట్లు తెలుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డితో విజయసాయిరెడ్డి చర్చలు జరుపుతున్నారని కూడా తెలుస్తోంది.
* బిజెపిలో చేరుద్దామనుకుంటే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి మరింత యాక్టివ్ అవుదామని ప్రయత్నించారు. కానీ అనుకున్న స్థాయిలో ఆయనకు మైలేజ్ రాలేదు. పైగా బిజెపిలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టిడిపి, జనసేన నుంచి అభ్యంతరాలు రావడంతో చేర్చుకునేందుకు బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇలానే ఉంటే పొలిటికల్ గా ఇబ్బందులు వస్తాయని విజయసాయిరెడ్డి భావిస్తున్నారు. అందుకే మీడియా రంగంలో అడుగు పెట్టాలని చేసిన ప్రయత్నాలు అన్ని కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు తదుపరి అంతా పాలిటిక్స్ పైనే దృష్టి పెట్టాలని చూస్తున్నారు.
* ఉభయ అవసరాలతో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి అవసరం ఉంది. విజయసాయి రెడ్డికి సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ఆప్షన్ గా ఉంది. ఎందుకంటే ఆ పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర ఆయనదే. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆయన ఫేమస్ అయ్యారు. ఇంతటి రాజకీయ గుర్తింపును సాధించారు. ఉభయ వర్గాల అవసరాల మేరకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళుతూ వెళుతూ విజయసాయిరెడ్డి చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. నమ్మకద్రోహం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఆయన పై విరుచుకుపడింది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి చేరిక పై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.