Nandamuri Family : సాధారణంగా నందమూరి కుటుంబ సభ్యులంతా.. ఆయా కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతారు. కానీ నిన్న మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన టీటీడీ భక్తి ఛానల్ నూతన చైర్మన్గా శ్రీధర్ వర్మ అనే వ్యక్తి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎక్కువగా నందమూరి కుటుంబ సభ్యులు హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాధ్యతలు తీసుకున్న శ్రీధర్ వర్మ కంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కువగా భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు దగ్గుబాటి పురందేశ్వరి కుమార్తె నివేదిత. ఆమె ఏకంగా నూతన చైర్మన్ శ్రీధర్ వర్మ కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన ఆడపడుచు ఇలా కాలికి నమస్కరించడం వెనుక దశాబ్దాల నాటి గాఢమైన అభిమానం, ఆత్మీయ అనుబంధం దాగివుంది. దీనిపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది.
* అత్యంత సన్నిహితుడు..
శ్రీధర్ వర్మ ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన తండ్రి రామచంద్ర రాజు. నందమూరి తారక రామారావుకు భక్తుడు. వీరాభిమాని కావడంతో ఆయనను అంతగా ప్రేమగా చూసుకునేవారు ఎన్టీఆర్. ఆయన సైతం ఎన్టీఆర్ రాజు గానే సుపరిచితులు. అఖిల భారత ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయనపై అభిమానంతో ఎన్టీఆర్ తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కానీ అప్పట్లో శ్రీవారి సేవకి అంకితం అయ్యారు. ఎన్టీఆర్ సూచనతో రెండుసార్లు టీటీడీ పాలకమండలి సభ్యుడిగా సేవలందించారు. మూడోసారి అవకాశం ఇస్తానన్నప్పుడు తనకు వద్దని వారించడమే కాదు.. బోర్డులో ఎవరికి రెండుసార్లకు మించి అవకాశం ఇవ్వకూడదు అనే సంస్కరణకు కూడా కారణమయ్యారు. టిటిడి అభివృద్ధి కోసం తన సొంత భూమిని సైతం దానం చేసిన గొప్ప నిబద్దతగల మనిషి ఎన్టీఆర్ రాజు.
* పాడే మోసి రుణం తీర్చుకొని..
అయితే ఎన్టీఆర్ కుటుంబం ఎప్పుడూ ఎన్టీఆర్ రాజు కు చాలా ప్రాధాన్యం ఇచ్చింది. గత ఏడాది ఎన్టీఆర్ రాజు మరణించారు. ఆ సమయంలో నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ స్వయంగా తిరుపతికి వెళ్లి ఆయన పాడే మోసి తమ కుటుంబ సభ్యుడి గానే తుది వీడ్కోలు పలికారు. ఇప్పుడు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ పార్టీలో ఎదుగుతున్న శ్రీధర్ వర్మను కూటమి ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు చైర్మన్గా నియమించింది. నందమూరి కుటుంబం అంతా తమ ఇంట్లో వేడుకల భావించి స్వయంగా తిరుపతికి వచ్చారు. నందమూరి మోహన్ కృష్ణ, రామకృష్ణ, మోహన రూప, కామినేని సీమంతిని, దగ్గుబాటి నివేదితతో పాటు కుటుంబ సభ్యులంతా ఒకే వేదికపై ఉండి ఆయనను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది.