Vijayasai Reddy: ఏదైనా ప్రచారాన్ని సొంత వారు చెబితే ఎవరైనా నమ్ముతారు. ఎందుకంటే షర్మిల జగన్మోహన్ రెడ్డితో విభేదించి చెప్పిన తర్వాతే చాలా విషయాలపై క్లారిటీ వచ్చింది. అంతెందుకు వివేకానంద రెడ్డి హత్య అంశానికి సంబంధించి ఆయన కుమార్తె సునీత పోరాటం ప్రారంభించాక అసలు విషయం తెలిసింది. సొంత మనుషులే వివేకానంద రెడ్డి హత్య చేశారని.. దానిని రాజకీయంగా వాడుకున్నారని స్పష్టమైంది. మరోవైపు తన అన్న వ్యక్తిత్వాన్ని బయట ప్రపంచానికి తెలియజెప్పింది కూడా షర్మిల. అయితే ఇప్పుడు షర్మిల రూట్లోకి విజయసాయిరెడ్డి వచ్చారు. మొత్తం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి గాలి తీసేశారు. మొన్నటికి మొన్న ఆయన అసమర్ధ ప్రతిపక్ష నాయకుడు అన్న విమర్శ చేసిన సాయి రెడ్డి.. ఏకంగా నిన్న రెండు పేజీలతో జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసిపి గుట్టు విప్పేశాడు. మున్ముందు మరిన్ని గుడ్లు విప్పే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు షర్మిల మాత్రమే తలనొప్పి అని భావించారు. ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి రూపంలో మరో తలనొప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు కాబోతోంది.
* మొన్నటి ఎన్నికల్లో షర్మిల..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెంచడంలో షర్మిల పాత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఎంతగా డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. ఇంటి గుట్టును బయట పెట్టేసారు. అన్న మనస్తత్వాన్ని కూడా బయట ప్రపంచానికి తెలియజేశారు. దీంతో ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో. ఇప్పుడు షర్మిల మాదిరిగానే విజయసాయిరెడ్డి సైతం మరోసారి జగన్మోహన్ రెడ్డికి భారీ డ్యామేజ్ చేసేలా కనిపిస్తున్నారు. నిన్ననే రెండు పేజీల లేఖతో విరుచుకుపడ్డారు. మున్ముందు తనతో చికాకు తప్పదు అంటూ సంకేతాలు పంపించారు.
* ఎదురుదాడి శరణ్యం..
వచ్చే ఎన్నికల నాటికి కొత్త పార్టీతో విజయసాయిరెడ్డి ముందుంటారు. తన పార్టీ ఉనికి చాటుకునేందుకు ఆయన ఎంచుకునే ఏకైక మార్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి. తెలుగుదేశం కూటమిపై ఆయన చేసే విమర్శలు రాజకీయ కోణంలో మాత్రమే ఉంటాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసే విమర్శలు మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. చాలా ప్రభావం కూడా చూపుతాయి. కాంగ్రెస్ పార్టీ నేత రూపంలో షర్మిల ఎలాగూ చికాకు పెడతారు. విజయసాయిరెడ్డి ఆమెకు తోడు అవుతారు. రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలను తట్టుకోవచ్చు కానీ.. సొంత వారు చేసే విమర్శలు మాత్రం చాలా నష్టం చేస్తాయి. గత ఎన్నికల్లో షర్మిల ఎదురుదాడికి జగన్ బాధితుడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎదురు దాడి చేసిన ఆయనే బాధితుడు. అప్పుడు షర్మిల చేసిన పోరాటం టిడిపి కూటమికి కలిసి వచ్చింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన పోరాటం కూడా అంతిమంగా టిడిపికి లబ్ధి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం షర్మిల తో పాటు విజయసాయిరెడ్డి అనే కొత్త శత్రువు తమకు తయారయ్యారన్న బాధ కనిపిస్తోంది.