Sajjala Botsa Controversy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై బాంబు వేశారు విజయసాయిరెడ్డి. తనను నమ్మకద్రోహి అంటూ విమర్శించడానికి తట్టుకోలేక 2 పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. ఆయనకంటే ఇంకా నమ్మకద్రోహి ఎవరు ఉంటారు అంటూ.. పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని, అవమానాలను ఏకరువు పెడుతూ తన ఆవేదనను బయటపెట్టారు. అయితే మధ్యలో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి అంటూ పరోక్షంగా బొత్స సత్యనారాయణ ప్రస్తావన తీసుకొచ్చారు. త్వరలో పార్టీ మారబోతున్న ఓ మాజీ మంత్రి అంటూ అభివర్ణించారు. బొత్సతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి తనపై కుట్ర చేసి.. ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవి నుంచి తొలగించారని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు రెండు విషయాల్లో క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి టిడిపి కోవర్టుగా పనిచేస్తున్నారని ఒకవైపు.. బొత్స సత్యనారాయణ పార్టీ మారబోతున్నారు అని క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు అంశాలు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన నింపుతున్నాయి.
* సజ్జలపై అనుమానం పెరిగేలా..
విజయసాయిరెడ్డి లాజిక్ తో కొట్టారు. నమ్మకద్రోహి అయి ఉంటే నాడు కాంగ్రెస్ పార్టీతో రాజీ పడే వాడినని.. జగన్మోహన్ రెడ్డితో కేసులు పడేవాడిని కాదు అంటూ.. పార్టీ ఏర్పాటుకు ముందు నుంచే తాను జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు అని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి పై ఒక్క ఛార్జ్ షీట్ దాఖలు కాని విషయాన్ని ప్రస్తావించి.. టిడిపి తో కుమ్మక్కు అయ్యారని చెప్పేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. దానిపై కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆలోచన మొదలైంది. సజ్జల రామకృష్ణారెడ్డి తీరు వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుందనే క్యాడర్ అభిప్రాయానికి మరింత బలం చేకూరింది.
* బొత్స పార్టీ మారడంపై..
మరోవైపు బొత్స సత్యనారాయణ పార్టీ మారే అవకాశం ఉన్నట్లు ఇటీవల ప్రచారం నడిచింది. కుటుంబ అవసరాల రిత్యా ఆయన జనసేనలో చేరుతారన్న టాక్ కూడా ఉంది. కానీ ఇంతవరకు ఆ ప్రచారాన్ని ఖండించలేదు బొత్స. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆ ప్రస్తావన తీసుకొచ్చేసరికి ప్రాథమికంగా ఏదో జరిగిందన్న అనుమానం ఉంది. అయితే బొత్స కు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారని మెజారిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిప్రాయపడ్డాయి. ఉత్త ప్రచారం అని తేల్చేసాయి. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి బొత్స విషయంలో బాంబు పేల్చారు. ఆయన పార్టీ మారబోతున్నట్లు ప్రస్తావన తీసుకొచ్చారు. ఒకవైపు సజ్జల టిడిపి కోవర్టుగా పనిచేస్తున్నారని ఒకవైపు.. బొత్స పార్టీ మారబోతున్నారన్న విషయం ఒక వైపు.. వైసీపీలో కల్లోలం రేపుతోంది.