ఎందుకో తెలియదు గానీ ఆంధ్రజ్యోతి పత్రిక వేమూరి రాధాకృష్ణ కూడా నవ యువకుడైపోయారు. అచ్చం నరేంద్ర మోడీ మాదిరిగా ఆయన కూడా జన్ జెడ్ పాట పాడుతున్నారు. నరేంద్ర మోడీ అంటే రాజకీయ నాయకుడు కాబట్టి.. నీట్ ఉద్యమం వల్ల ఆయన ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది కాబట్టి తప్పదు.
రాధాకృష్ణ ఎందుకు ఇలా జెన్ జెడ్ పాట పాడుతున్నారు అర్థం కావడం లేదు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటిని పట్టించుకోకుండా కేవలం బొద్దింకల సేవలో తరించిపోయారు. బొద్దింకల ఉద్యమం గురించి తన కొత్త పలుకులో ఏకంగా మూడో వంతు పేజీ లో సంపాదకీయం రాశారు. బొద్దింకల ఉద్యమం గొప్పదని.. బొద్దింకల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారంతా దేశానికి సేవ చేయడానికి వచ్చారని.. ఇలా రకరకాల కీర్తనలు ఆయన విశ్లేషణలో కనిపించాయి.
రాధాకృష్ణ రాసిన సంపాదకీయంలో బొద్దింకల గురించి అనేక కీర్తనలు.. స్తుతి రాగాలు కనిపించాయి. ఇంత రాసిన రాధాకృష్ణ.. ఢిల్లీ పోలీసులు బొద్దింకల ఉద్యమంలో పాల్గొన్న సంఘ వ్యతిరేక శక్తుల గురించి తెలుసుకోలేకపోయారా.. విద్యార్థులు చేసిన ఉద్యమంలో రకరకాల కేసులు ఎదుర్కొన్నవారు.. రకరకాల అభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారన్న విషయం రాధాకృష్ణకు తెలియలేదా.. బొద్దింకల తరహాలో నేపాల్.. శ్రీలంక.. బంగ్లాదేశ్.. మయన్మార్ వంటి ప్రాంతాలలో ఉద్యమాలు జరిగినప్పుడు.. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు ఎలా పరిపాలిస్తున్నాయో రాధాకృష్ణ తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరం.
విద్యార్థులకు ఆవేశం ఉండాలి. దేశం మీద ప్రేమ ఉండాలి. దేశానికి ఏదైనా అన్యాయం జరిగితే గట్టిగా మాట్లాడే స్థాయి ఉండాలి. కానీ, ఆవేశం దేశంలో విధ్వంసానికి దారి తీయకూడదు. ఇతర పరిణామాలకు కారణం కాకూడదు. బొద్దింకల ఉద్యమంలో జరిగింది అదే. అందువల్లే వారి కదలికల మీద దేశంలో ఉన్న నిఘా సంస్థలు దృష్టిపెట్టాయి. వారు అనుమానించినట్టుగానే అందులో సంఘవిద్రోహశక్తులు ఉన్నారు. వారంతా కూడా విధ్వంశాలకు పాల్పడ్డారు. వారి మీద అనేక రకాల కేసులు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తులు చేస్తున్న ఉద్యమాన్ని ఏ తరహాలోనిది.. ఎటువంటిది.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఉద్యమాన్ని రాధాకృష్ణ మొత్తం భుజాలకు ఎత్తుకోవడమే అసలైన విషాదం. తాత్కాలిక ఆవేశం తీవ్రమైన అనర్ధాలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక ఆలోచన కొత్తవికాసానికి నాంది పలుకుతుంది. ఇంతటి సంపాదకీయం రాసేముందు రాధాకృష్ణ ఈ ఒక్క వాక్యాన్ని మననంలో పెట్టుకుంటే ఎంతో బాగుండేది. పాపం ఎలాంటి వార్తలు రాసే రాధాకృష్ణ చివరికి ఇలాంటి వ్యాసాలు రాయాల్సి వస్తోంది.