Vemuri Radhakrishna : తెలుగులో మీడియా మొగల్ గా పేరు తెచ్చుకున్నారు రామోజీరావు. ఆయన ఉన్నంతకాలం తెలుగు మీడియాకు పెద్దదిక్కుగా ఉన్నారు. ఆయన గతించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి వేమూరి రాధాకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో విలేఖరిగా పని చేశారు రాధాకృష్ణ. ఆ తర్వాత మూతపడిన ఆ సంస్థను కొనుగోలు చేసి.. అనేక రకాలుగా ఇబ్బందులు పడి నిలబెట్టారు. ఆంధ్రజ్యోతి పత్రిక.. ఏబీఎన్ ఛానల్ ఏర్పాటుచేసి తెలుగు మీడియాలో తనకంటూ ఒక ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రి వెనుకవైపు ఏబీఎన్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఒక ప్రైవేట్ బిల్డింగును అద్దెకి తీసుకొని అందులో కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇక జర్నలిస్ట్ కాలనీలో ఒక భవనాన్ని నిర్మించుకొని అందులో ఆంధ్రజ్యోతి పత్రిక నిర్వహిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయాన్ని మూసివేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ రాధాకృష్ణ వెనకడుగు వేయలేదు. పైగా తన పత్రిక కార్యాలయ భవనం సక్రమంగానే ఉందని నిరూపించుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు.
ఇక ఇటీవల వేమూరి రాధాకృష్ణ జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే ఒక ఖరీదైన ఏరియాను కొనుగోలు చేశారు. అక్కడ ఏబీఎన్ ఛానల్.. ఆంధ్రజ్యోతి పత్రికను నిర్వహించబోతున్నారు. కార్పొరేట్ స్థాయిలో ఆ బిల్డింగ్ నిర్మించారు.. ఆ బిల్డింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మూతపడిన పత్రికను నిలబెట్టడం ఒక సాహసం అయితే.. దానిని శిఖర స్థాయికి తీసుకెళ్లడం మరొక సాహసం. ఈ రెండిటిని రాధాకృష్ణ చేశారు. అయితే రాధాకృష్ణ నిర్మిస్తున్న నూతన భవంతిని గులాబీ పార్టీ నాయకులు.. గులాబీ పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండడంవల్ల.. చంద్రబాబు భజన చేయడం వల్ల రాధాకృష్ణ బాగానే సంపాదించాడని.. అందువల్లే ఈ స్థాయిలో భవనం నిర్మించాడని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు కేసీఆర్ రాధాకృష్ణను పరామర్శించారు. క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.. ఒకవేళ రాధాకృష్ణ నిర్మించిన భవనం అక్రమం అయితే ఆ రోజే కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకునేది కదా. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాధాకృష్ణ తన భవన నిర్మాణ ప్రారంభించారు. అప్పుడు ఆ నిర్మాణం అక్రమం అయితే అడ్డుకునేవారు కదా.. సోషల్ మీడియాలో గులాబీ పార్టీ నేతలు.. గులాబీ పార్టీకి అనుకూలంగా ఉండే సో కాల్డ్ జర్నలిస్టులు విమర్శలు చేసినతమాత్రాన రాధాకృష్ణ విలువ తగ్గదని ఆంధ్రజ్యోతి ఉద్యోగులు అంటున్నారు. బ్యాంకులలో రుణాలు తీసుకొని ఆ బిల్డింగ్ నిర్మించారని.. కావాలంటే పూర్తి వివరాలు అందిస్తామని ఆంధ్రజ్యోతి సిబ్బంది అంటున్నారు.
తెలుగు మీడియాలో టీవీ9.. టీవీ5.. ఎన్టీవీ.. టెన్ టీవీ.. ఈటీవీ వంటి మీడియా సంస్థలకు భారీ భవంతులు ఉన్నాయి. చివరికి నమస్తే తెలంగాణ పత్రికకు.. టీ న్యూస్ కి కూడా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. మీడియా సంస్థలు సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడంలో తప్పులేదు. పైగా వారి స్తోమతకు తగ్గట్టుగా భవనాలు నిర్మించుకుంటారు. కానీ కొంతమంది కావాలని విమర్శలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.