Punganur TDP: పుంగనూరు నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ హై కమాండ్. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తోంది. వైసిపి మాదిరిగా వై నాట్ అనే పదం ప్రయోగించకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అందులో భాగంగా టిడిపి నియోజకవర్గ బాధ్యతల నుంచి చల్లా బాబును తప్పించింది. ఆయన స్థానంలో మధుసూదన్ నాయుడుకు బాధ్యతలు కట్టబెట్టింది. గత కొంతకాలంగా చల్లా బాబు అని పిలవబడే చల్లా రామచంద్రారెడ్డి గట్టిగానే కృషి చేశారు. అయితే సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు ఆయన తేలిపోతున్నారు. ఆపై ఆయనపై ఫిర్యాదులు రావడంతో హై కమాండ్ మార్పు చేసింది. కొత్త నేతకు బాధ్యతలు అప్పగించడంతో టిడిపి శ్రేణుల్లో జోష్ నెలకొంది.
* సీనియర్ మోస్ట్ లీడర్..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. సుదీర్ఘకాలం శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు కు తీవ్ర వ్యతిరేకి. రాజకీయంగా బద్ధ శత్రువు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆయనను కుప్పంలో ఓడించాలని శతవిధాల ప్రయత్నాలు చేశారు. తన సొంత నియోజకవర్గంలో పుంగనూరు కంటే కుప్పం పైనే అధిక దృష్టి పెట్టారు. ఒకానొక దశలో చంద్రబాబు కుప్పంలో అడుగుపెడితే వైసీపీ శ్రేణులతో తిరుగుబాటు చేయించే ప్రయత్నం కూడా జరిగింది. కానీ వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు చంద్రబాబు. ఇప్పుడు అదే చంద్రబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరు పై ఫుల్ ఫోకస్ పెట్టారు.
* గట్టిగానే ఎదుర్కొన్న..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి వ్యతిరేకంగా నిలిచారు చల్లా రామచంద్రారెడ్డి. వైసిపి ఐదేళ్ల కాలంలో పుంగనూరు లాంటి నియోజకవర్గం లో టిడిపి జెండా పట్టుకుని నిలబడ్డారు.. కానీ ఇటీవల చల్లా బాబు వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ గ్రాఫ్ తగ్గుతోందని నివేదికలు అందాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సన్నాహక సమావేశం తిరుపతిలో జరిగింది. అయితే ఆ సమావేశంలో చల్లా బాబు వర్గం, మధుసూదన్ నాయుడు వర్గం మధ్య గొడవ జరిగింది. అయితే క్రమశిక్షణ కట్టు దాటిన క్రమంలో చల్లా బాబు వర్గం పై అనేక ఆరోపణలు వచ్చాయి. పైగా ఇటీవల చల్లా బాబుపై సొంత పార్టీ శ్రేణులే హై కమాండ్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు పంపించాయి. వచ్చే ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో టిడిపి నాయకత్వం ఉంది. అందుకే అక్కడ పూర్తిగా దృష్టిపెట్టారు చంద్రబాబు, లోకేష్ లు. అక్కడ నాయకత్వం మారిస్తే కానీ పరిస్థితిలో మార్పు రాదని గమనించిన వారు మధుసూదన్ నాయుడు వైపు మొగ్గు చూపారు. మరి ఈ ప్రయత్నం పుంగనూరులో ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.