Pawan Kalyan: మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. వారు అనుకున్న స్థితిలో పనిచేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలపై జనసేన ఎమ్మెల్యేలు స్పందించడం లేదని పవన్ ప్రస్తావించారు. గతంలో కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఇదే మాదిరిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఏ పరిణామం జరిగినా తనను వైసీపీ కార్నర్ చేస్తోందని.. జనసేన ఎమ్మెల్యేలు తిప్పి కొట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. కాకినాడలో మాటామంతి పేరుతో నిర్వహించిన సమావేశంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఘాటుగానే వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్.
* పవన్ ఓపెన్..
పవన్ కళ్యాణ్ ఇటీవల బ్లాస్ట్ అవుతున్నారు. కాపుల విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. తనకు కాపు కులం మాత్రమే కొమ్ముకాయ లేదని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గం అండతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని తేల్చి చెబుతున్నారు. ఇటీవల సాయి కృష్ణ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. అయితే ఆయనపై అనేక నేరాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి అదృశ్యమైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. కానీ జనసేన నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఆశించిన స్థాయిలో లేదు. దానిపైనే ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కులం ఓట్లు, మతం ఓట్లు, ఓ వర్గం ఓట్లు పోతాయని భావించవద్దని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
* వైసీపీని ధీటుగా ఎదుర్కోండి..
గతంలో కూడా జనసేన ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబుకు సైతం చురకలు అంటించారు. వైసీపీ నుంచి ప్రభుత్వం పై ఆ స్థాయిలో విమర్శలు వస్తుంటే ఎందుకు చెక్ పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. అది టిడిపి ప్రభుత్వం మాత్రమే కాదని కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఓటమిలో జనసేన కీలక భాగస్వామ్యం అని గుర్తించుకోవాలన్నారు. అప్పట్లో కొద్ది రోజులపాటు జనసేన ఎమ్మెల్యేలు గట్టిగానే ఎదుర్కొన్నారు వైసీపీ విమర్శలపై. తరువాత ఆ విమర్శలు తగ్గిపోయాయి. ఇప్పుడు సాయి కృష్ణ ఉదంతంతో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. కాపులకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. అయితే దీనిపై పవన్ ఏం చేస్తారు? ఒక క్రిమినల్ అదృశ్యమైతే పవన్ ఎందుకు బాధ్యత తీసుకుంటారు? అని జనసేన ఎమ్మెల్యేలు ఎవరు నిలదీయలేదు. దానినే ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. వైసీపీ నుంచి వస్తున్న విమర్శలను ఎదుర్కోవడంలో జనసేన ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గుతుండడాన్ని ప్రస్తావించారు. ఇకనుంచి అటువంటి పరిస్థితి లేకుండా గట్టిగానే మాట్లాడాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం విశేషం.
