Local body elections in AP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుందా? వరుసగా ఎన్నికలు రానున్నాయా? ముందుగా సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ముందుగా మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. మార్చి 17తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. సర్పంచ్ల పదవీకాలం ఏప్రిల్ 4 తో ముగియనుంది. ఎంపీటీసీలతో పాటు జడ్పిటిసి లకు సంబంధించిన పదవీకాలం జూన్ వరకు ఉంది. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నీలం సాహ్ని సిద్ధమని ప్రకటించారు. జిల్లాల యంత్రాంగాలను సిద్ధం చేశారు. ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల రూపకల్పన వంటివి ఇప్పటికే దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ దూకుడు చూస్తుంటే మే నెలలో పంచాయితీ, అక్కడ కొద్ది రోజులకే మున్సిపాలిటీ, ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలను పూర్తిచేసేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్థమవుతోంది.
రాజకీయ పరిస్థితుల దృష్ట్యా..
మరోవైపు రాజకీయ పరిస్థితులను చూస్తుంటే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి శాతం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు. ఇటువంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తే.. మూడు పార్టీల మధ్య పదవుల సర్దుబాటు చేస్తే.. వచ్చే మూడేళ్లలో మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేస్తాయి. అందుకే వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మూడు పార్టీల నాయకత్వాలు తమ పార్టీల శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బలం ఉన్నచోట మాత్రమే అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ప్రచారం నడుస్తోంది. ప్రజల్లో బలం ఉన్న పార్టీలకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం బలపడకుండా చూడాలని కూటమి భావిస్తున్నట్లు సమాచారం.
జనగణనతో సంబంధం లేకుండా..
అయితే ఈనెల 20 తరువాత దేశవ్యాప్తంగా తొలి విడత జన గణన మొదలవుతుంది. సుమారు ఏడాదిన్నర ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ లెక్కన 2027 లోనే ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అయితే 2018లో చంద్రబాబు చేసిన తప్పిదం అదే. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు ఆసక్తి చూపలేదు. 2019 ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది. ఇప్పుడు జనాభా గణ న అంటూ వాయిదా వేస్తే మాత్రం కూటమి పార్టీలకు ఇబ్బంది కరం.. పైగా స్థానిక సంస్థల ఎన్నికలకు కులగణన అనేది అడ్డంకి కాదు. ఎందుకంటే ఆర్థిక సంఘం నిధులన్నీ స్థానిక సంస్థల పాలకవర్గాల తోనే సంబంధం ఉంటుంది. పాలకవర్గాలు ఉంటేనే ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి. అయితే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం వేసవిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.