Two new parties formed in AP: ఏపీలో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని దశాబ్దాల కాలం ఏలింది. దానికి 1983లో బ్రేక్ పడింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ప్రాంతీయ పార్టీల హవా ప్రారంభం అయింది. కానీ 2014 వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు పరిస్థితి ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి, వామపక్షాలు, ఎంఐఎం రాజకీయం చేసేవి. తరువాత కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ఆవిర్భవించింది. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం, జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోక్సత్తా.. ఇలా చాలా పార్టీలు వచ్చాయి. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జాతీయ పార్టీలు పక్కకు వెళ్లిపోయాయి. ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన, వైయస్సార్ కాంగ్రెస్, బిజెపి క్రియాశీలక పార్టీలు గా ఉన్నాయి. అయితే మరో మూడు ప్రాంతీయ పార్టీలు రానున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే అంతటి స్పేస్ ఏపీ రాజకీయాల్లో ఉంటుందా? అనే ప్రశ్న మాత్రం వినిపిస్తోంది. కానీ అవసరాలు, ఆకాంక్షల కోసం మూడు పార్టీలు ఏర్పాటు అవుతాయని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.. అయితే అది కేవలం ప్రచారమా? నిజంగా కార్యరూపం దాల్చే అవకాశం ఉందా? కాలమే నిర్ణయించనుంది.
మాజీ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు నూతన రాజకీయ పార్టీ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఐఏఎస్ అధికారిగా ఉన్న ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీవ్ర అన్యాయానికి గురయ్యారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వానికి ప్రయోజనం కల్పించేందుకు వైసిపికి దెబ్బ కొట్టారని జగన్ అనుమానించారు. అందుకే వైసిపి హయాంలో వెంకటేశ్వరరావును పక్కనపెట్టారు. చివరకు ప్రమోషన్ రోజునే పదవీ విరమణ చేసుకోవాల్సి వచ్చింది. అయితే తనకు నష్టపరిచిన జగన్మోహన్ రెడ్డి విషయంలో కూటమి ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తోందని వెంకటేశ్వరరావు లో ఒక బాధ ఉంది. పైగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేశారని.. వర్కౌట్ కాలేదని ప్రచారం నడుస్తోంది. అందుకే సొంత పార్టీ ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా చంద్రబాబు అంటే ఇష్టపడని కమ్మ సామాజిక వర్గం నేతలు, బ్యూరోక్రాసివ్యవస్థలో పనిచేసిన మాజీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడతానని చాలా రోజుల కిందటే ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 నేతగా ఎదిగిన ఆయన పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఆయనకు కూటమి పార్టీలో ఛాన్స్ లేదు. బిజెపిలో చేరే విషయంలో టిడిపి నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే ఆయన ఇప్పుడు సొంత పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా సొంత మీడియాను ఏర్పాటు చేసి తర్వాత పార్టీని ప్రారంభిస్తారని సమాచారం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఇష్టపడని రెడ్డి సామాజిక వర్గం నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఇద్దరు అధినేతలను విభేదించే వారితో ఈ రెండు పార్టీల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతుండడం విశేషం.