YS Jagan Mohan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియా నష్టం చేకూరుస్తుందా? లాభం చేకూరుస్తుందా? అన్నది తెలియడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని హైలెట్ చేస్తోంది సోషల్ మీడియానే. పలుచన చేస్తోంది సోషల్ మీడియానే. జగన్ జనం ముందుకు వస్తే జన ప్రభంజనం అంటూ చూపిస్తోంది. మీడియా ముందుకు వస్తే వచ్చే ఆణిముత్యాలను చూపిస్తోంది. అయితే ఈ విషయంలో ఎలా రిసీవ్ చేసుకోవాలో ప్రజలకు తెలియడం లేదు. తాజాగా హైదరాబాద్ వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఓ వివాహ వేడుకలకు హాజరైన జగన్మోహన్ రెడ్డి కి జనం నీరాజనం పట్టారు. విమానాశ్రయం నుంచి దారి పొడవునా స్వాగతం పలుకుతూ కనిపించారు. అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదు. కానీ ఇది ఎలా సాధ్యం అనేది ఒక ప్రశ్న. ప్రజలు స్వచ్ఛందంగా నైనా వచ్చి ఉండాలి. లేకుంటే జన సమీకరణ అయినా చేసి ఉండాలి. సాధారణంగా ఒక వివాహానికి హాజరైతే అక్కడకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళిపోతారు. కానీ వస్తున్నది జగన్ కాబట్టి ఈ జనాలు వచ్చారు అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపే విషయం.
* ఆణిముత్యాలు ట్రోల్స్..
జగన్ ప్రతి వారం మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వ వైఫల్యాల పై మాట్లాడుతుంటారు. శాసనసభకు హాజరు కావడం లేదు కాబట్టి.. బాధ్యతగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు మంచి పాలన అందించేలా చూడడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అంతవరకు ఓకే కాని జగన్ ఇలా మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఏవేవో ఆణిముత్యాలు ఆయన నోటి నుంచి వస్తుంటాయి. అప్పుడు సోషల్ మీడియాకు ఒకటే పని. ఇలా మాట్లాడారో లేదో క్షణాల్లో ఆణిముత్యాలు చుట్టూ ట్రోల్స్ నడవడం ప్రారంభిస్తాయి. అందుకే మీడియా ముందుకు జగన్ వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన గుబులు. ఆయన చేసే పవర్ఫుల్ ప్రకటనల కంటే డ్యామేజ్ చేసే ఆణిముత్యాలు అధికం.
* జనాల్లోకి వస్తే అదో ప్రచారం..
ఇక జగన్ జనాల్లోకి వస్తే వీర విహారమే. ఎటుచూడు జనమే కనిపిస్తారు. జైల్లో ఉన్న నేతలను పరామర్శించినప్పుడు.. ఇబ్బందుల్లో ఉన్న రైతులను సందర్శించినప్పుడు.. ఎవరైనా మృతి చెందితే బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించినప్పుడు.. ఇలా ఎక్కడకు వెళ్ళు జగన్ కనిపిస్తే జనం నీరాజనాలు పట్టాల్సిందే. అయితే వాటిని సోషల్ మీడియాలో మరింత హైప్ గా చూపిస్తుంటారు. ఆయన ఆడే మాటలు ఎంతలా ట్రోల్స్ కు గురవుతాయో.. ఆయన పర్యటనల్లో జనం కూడా కనిపిస్తే అలానే హైలెట్ అవుతుంది సోషల్ మీడియాలో. అయితే జనాలు మాత్రం జగన్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. మనవాడు మీడియా ముందుకు వచ్చిన అవే సుభాషితాలు.. జనాల్లోకి వచ్చినా అవే హైప్ లు అంటూ ఎక్కువమంది తేలికగా తీసుకుంటున్నారు.