Jagan Mohan Reddy సోషల్ మీడియాతో ప్రయోజనాలు ఎన్నో.. అనర్ధాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఏదేదో మాట్లాడేస్తామంటే కుదరదు. ఏవేవో పోస్టులు పెడతామంటే అంతకంటే కుదరదు. మాటజారి వెనక్కి తీసుకుంటామంటే అంతకంటే కుదరదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే లోపాన్ని బయటపెట్టింది సోషల్ మీడియా. ఆయన ఏ అంశం పైనైనా స్టాండ్స్ మార్చుతూ ఉంటారు. తర్వాత దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మరో ప్రకటన చేస్తారు. అలా సోషల్ మీడియా వాచ్ చేసి దానిని బయట పెడుతుండడంతో ఆయన బలహీనం అవుతున్నారు ప్రజల్లో. రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం వరకు జగన్ చేసిన ప్రకటనలు ‘నాడు నేడు’ అంటూ సోషల్ మీడియా బయటపెడుతోంది. ఆ పార్టీ శ్రేణుల్లో కూడా అదే ఆందోళన. ప్రత్యర్థులకు ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతున్నాయి.
* ఎప్పటికప్పుడు మాట మార్పు..
2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజధానిగా అమరావతికి ఓకే చెప్పింది జగన్. అంతటితో ఆగకుండా 33 వేల ఎకరాలు సరిపోవు.. అంతకుమించి కావాలి అంటూ నోరు జారారు. ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ఒక్క రాజధాని సరిపోదు.. మూడు రాజధానులు కావాలి అంటూ అదే రాజధాని విషయంలో మాట మార్చారు. ప్రతిపక్షంలో ఉండగా విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం ఏముంది అని ప్రశ్నించారు. ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్ ఎందుకు? అంటూ నోరు జారారు. అయితే ఇప్పుడు వైభవంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సమయంలో.. క్రెడిట్ కోసం పోటీపడుతున్నారు. నాడు రాజధానికి 33 వేల ఎకరాలు సరిపోవు అంటూ చెప్పిన ఆయన.. ఇప్పుడు చంద్రబాబు అమరావతి నిర్మాణం జరుపుతుంటే విమర్శలు చేస్తున్నారు.
* కియా కార్ల పరిశ్రమ విషయంలో..
2014 టిడిపి ప్రభుత్వ సమయంలో అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమ వచ్చింది. అప్పట్లో కూడా హేళనగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు వెనుక తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కృషి ఉందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట్లాడితే పార్టీ శ్రేణులు ఆహ్వానించవచ్చు కానీ.. సోషల్ మీడియా ఊరుకోదు. జగన్నాడు పలికిన చిలక పలుకులు.. నేడు కూస్తున్న కోయిల అరుపులు అన్ని సోషల్ మీడియా ప్రజల ముందు ఉంచుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడకపోయినా పర్వాలేదు గాని సోషల్ మీడియాకు భయపడాలి. అలా చేయకపోతే ఇదే పరిస్థితి వస్తుంది.