ICC ODI World Cup : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ (ICC Men’s ODI World Cup) షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే రెండు అగ్రశ్రేణి జట్లు తలపడనుండటంతో టోర్నీకి అదిరిపోయే ఆరంభం లభించనుంది.
ప్రపంచకప్ తొలి దశలో రౌండ్ రాబిన్ పద్ధతిలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అక్టోబర్ 7 నుంచి 24 వరకు మొత్తం 30 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ దశలో ప్రతి జట్టు ఇతర జట్లతో పోటీపడుతూ తదుపరి దశకు అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తుంది. గ్రూప్ దశలో ప్రదర్శన ఆధారంగా జట్లు సూపర్-7 దశకు చేరుకుంటాయి.
అక్టోబర్ 25 నుంచి నవంబర్ 14 వరకు సూపర్-7 దశ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ దశలో మొత్తం 21 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇక్కడ ప్రతి మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం సాధించడంతో పాటు సెమీఫైనల్‌కు చేరేందుకు జట్లు గట్టిగా పోటీపడనున్నాయి.
ఆ తర్వాత నాకౌట్ దశ ప్రారంభమవుతుంది. నవంబర్ 17న సెమీఫైనల్-1, నవంబర్ 18న సెమీఫైనల్-2 జరగనున్నాయి. ఇక నవంబర్ 21న జొహన్నెస్‌బర్గ్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. దీంతో ప్రపంచకప్ విజేత ఎవరో తేలనుంది.
టీమ్‌ఇండియా షెడ్యూల్ ఇదే..
భారత జట్టు టోర్నీలో తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో జరిగే ఈ మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించనుంది. ఆ తర్వాత అక్టోబర్ 10న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్ తదుపరి మ్యాచ్‌ను అక్టోబర్ 14న అఫ్గానిస్థాన్‌తో ఆడుతుంది. అక్టోబర్ 17న క్వాలిఫయర్-ఎతో పోటీ పడనుంది. గ్రూప్ దశలో టీమ్‌ఇండియా చివరి మ్యాచ్ అక్టోబర్ 24న జింబాబ్వేతో జరగనుంది.
టీమ్‌ఇండియా మ్యాచ్‌ల వివరాలు
అక్టోబర్ 7: భారత్ vs ఆస్ట్రేలియా
అక్టోబర్ 10: భారత్ vs పాకిస్థాన్
అక్టోబర్ 14: భారత్ vs అఫ్గానిస్థాన్
అక్టోబర్ 17: భారత్ vs క్వాలిఫయర్-ఎ
అక్టోబర్ 24: భారత్ vs జింబాబ్వే
ప్రపంచకప్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి జట్ల మధ్య జరిగే పోటీలు టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌లోనే భారత్ తన సత్తా చాటితే టోర్నీలో శుభారంభం లభించినట్టవుతుంది.
దక్షిణాఫ్రికా పరిస్థితులు పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత బ్యాటర్లకు, బౌలర్లకు ఈ టోర్నీ పెద్ద సవాలుగా మారనుంది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందే జట్టు కూర్పు, ఆటగాళ్ల ఫామ్, పిచ్ పరిస్థితులు, వాతావరణం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. మరి ఈసారి ప్రపంచకప్ ట్రోఫీని ఏ జట్టు సొంతం చేసుకుంటుందో చూడాలి.
పూర్తి షెడ్యూల్ ను కింద లింక్ లో స్లైడ్స్ గా చూడొచ్చు.
View this post on Instagram