Jagan Mohan Reddy : ఏపీ రాజకీయాల్లో ఊహించని ఒక పరిణామం జరిగిందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అది కూడా జాతీయ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బెంగళూరు వేదికగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో జగన్ చర్చలు జరుపుతున్నారు అనేది దాని సారాంశం. గతంలో కూడా ఇటువంటి వార్తలు హల్చల్ చేశాయి. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారని.. అందుకే బెంగళూరులో నివాసం ఏర్పాటు చేసుకున్నారని.. హైదరాబాద్ కంటే బెంగళూరు కే ప్రాధాన్యమిస్తున్నారన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. ఆపై ప్రస్తుత కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లు కూడా ప్రచారం నడిచింది. డీకే శివకుమార్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు కూడా. అయితే ఈ పరిణామాల క్రమంలో తాజాగా ఏఐసీసీకి చెందిన ఓ అగ్రనేత జగన్ తో చర్చలు జరిపారన్నది ప్రధాన సారాంశం.
* బిజెపితో సన్నిహిత సంబంధాలు..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు నుంచి బిజెపి పెద్దలతో మంచి సంబంధాలు నడుపుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు గత పదేళ్లుగా కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి పలు కీలక బిల్లులు, విధానపరమైన నిర్ణయాలు జగన్ బే షరతుగా మద్దతు ప్రకటించారు. ఇప్పుడు కూడా బిజెపికి మద్దతుగా ఉంటున్నారు. కానీ ఆయన రాజకీయ విధానాన్ని ప్రశ్నించేలా ఉంది. అందుకే ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. పైగా ఏపీకి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధాన భాగస్వామ్య టిడిపి ఉండడంతో చంద్రబాబుకు సైతం ఎనలేని గౌరవం దక్కుతోంది. దీనికి తోడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఉన్న పాత కేసులకు సంబంధించి కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడం కూడా జగన్ మనసు మారడానికి ఒక కారణంగా తెలుస్తోంది.
* కీలక చర్చలు..
బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డితో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రహస్య చర్చలు జరిపినట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. జాతీయస్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాల క్రమంలోనే జగన్ తన రాజకీయ వైఖరిని మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారని సంకేతాలు వస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు, ఇటీవల నిరుద్యోగం, పేపర్ లీకేజీల అంశం, వ్యవస్థాగత సమస్యలపై యువత, జెన్ జీ వర్గాల్లో కేంద్ర ప్రభుత్వం పై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోందని.. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇది మరింత తీవ్ర రూపం దాల్చి అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే జాతీయస్థాయిలో బిజెపికి దగ్గరగా ఉండడం కంటే.. పుంజుకుంటున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమితో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందవచ్చు అని జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
* సమూల మార్పులు..
ఒకవేళ జగన్ ఇండియా కూటమికి దగ్గర అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా సమూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయితే మాత్రం కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయ మార్పులు ఖాయం. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి బిజెపి పై తిరుగుబాటు చేయడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..